Kani Kusruti About Malayali Movies: ఈ మ‌ధ్య జ‌రిగిన కేన్స్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ లో 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్' అనే చిత్రానికిగాను గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అందుకున్నారు మ‌ల‌యాళ న‌టి, మోడ‌ల్ క‌ని కుస్రుతి. పాయ‌ల్ క‌పాడియా తెర‌కెక్కించిన ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా న‌టించారు. దీంతో ఇప్పుడు ఆమె ఫేమ‌స్ అయిపోయారు. ఆమె పేరు మారుమోగిపోతుంది. అయితే, క‌స్రుతి వార్త‌ల్లో నిల‌వ‌డం ఇదేమి మొద‌టిసారి కాదు. గ‌తంలో ఆమె చేసిన ఎన్నో సినిమాలు వివాదాలకు తెరతీశాయి. దీంతో ఇప్పుడు అలాంటి సినిమాలు చేయ‌ను అని చెప్తున్నారు క‌స్రుతి. కేన్స్ నుంచి తిరిగి వ‌చ్చిన ఆమె ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాలు వెల్ల‌డించారు. 


డ‌బ్బుల కోస‌మే ఆ సినిమా చేశాను.. 


క‌స్రుతి న‌టించిన 'బిర్యాని' సినిమా ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. అందులో ఆమె టాప్‌లెస్‌గా నటించింది. 2020లో వ‌చ్చిన ఈ సినిమాకి స్టేట్ అవార్డు కూడా ద‌క్కింది. కానీ, అది ముస్లింల‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ సినిమా డైరెక్ట‌ర్ సాజిన్ బాబు కూడా ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అందుకే, ఇప్పుడు అలాంటి సినిమాలు చేయ‌ను అంటున్నారు కస్రుతి. అప్పుడు కేవ‌లం డ‌బ్బుల కోస‌మే ఆ సినిమా చేశాన‌ని పేర్కొంది. “బిర్యానీ సినిమా చేస్తున్న‌ప్పుడు అది త‌న‌కు సంబంధించిన‌, త‌న‌కు సూట్ అయ్యే సినిమా కాదు అని సాజిన్‌కు చెప్పాను. నేను ముందు ఆ సినిమా చేయ‌ను అని చెప్పాను. కానీ, ఆర్థిక ఇబ్బందులు వ‌ల్ల చేయాల్సి వ‌చ్చింది. ఇక సాజిన్ ముస్లిం బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చాడు. అక్క‌డి ప‌రిస్థితులు గురించి చెప్పాడు. త‌న దృష్టిలో అది క‌రెక్ట్ అని చెప్పాడు. అంతే త‌ప్పితే అవి నా ఇబ్బందులు కావు”  అని చెప్పింది కస్రుతి. 


అలాంటి సినిమాలు చేయాల‌నుకోవ‌డం లేదు.. 


రాజకీయాలకు అతీతంగా ఉండే సినిమాలను తిరస్కరిస్తానని క‌స్రుతి తెలిపింది. అందుకే, కేర‌ళ స్టోరీ డైరెక్ట‌ర్ త‌ర్వాతి సినిమాకి ఆడిష‌న్‌కు ర‌మ్మంటే రిజ‌క్ట్ చేశాన‌ని పేర్కొంది. ఇక నుంచి అన్ని అనుకూలిస్తే.. అలాంటి సినిమాలు చేయ‌ను అని డిసైడ్ అయ్యానని కస్రుతి తెలిపింది. త‌న‌కు మ‌ల‌యాళం కంటే హిందీ లోనే ఆఫ‌ర్లు ఎక్క‌ువుగా వ‌స్తున్నాయ‌ని చెప్పింది. మ‌ల‌యాళంలో చాలామంది డైరెక్ట‌ర్లు ఉన్నార‌ని, కానీ వాళ్లు త‌న‌కు ఛాన్సులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించింది. “మల‌యాళంలో ఎందుకు సినిమాలు ఎక్కువ చేయ‌డం లేదు అని మీరు న‌న్ను అడ‌ుగుతున్నారు. ఆఫ‌ర్లు ఇస్తే క‌చ్చితంగా చేస్తాను. కానీ నాకు మ‌ల‌యాళం కంటే హిందీలోనే ఎక్కువ‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. నాకు పాత్ర ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదు. కనీసం ఆడిషన్‌కు అవకాశం ఇస్తే నేను ఆనందిస్తా. నాకు ఎలాంటి ఉపాది లేన‌ప్పుడు కచ్చితంగా కాంట్ర‌వ‌ర్సీ సినిమాలు చేస్తాను ” అని తెలిపింది.


మ‌ల‌యాళ సినిమాల్లో మ‌హిళ పాత్ర‌ల‌పై.. 


మ‌ల‌యాళ సినిమాల్లో మ‌హిళ‌ల పాత్ర‌ల లేక‌పోవ‌డంపై అడిగిన ప్ర‌శ్న‌కి ఆమె ఇలా స‌మాధానం చెబుతూ.. స్క్రిప్ట్‌లో మహిళ పాత్రలు అవసరమైతే మాత్రమే రాయాల‌ని తాను నమ్ముతున్నానని తెలిపింది. “ప్రతి సంవత్సరం 200 పైగా చిత్రాల‌ను తీసే ప‌రిశ్ర‌మలో మ‌హిళా ప్రాముఖ్య పాత్ర‌లు ఉన్న సినిమాలు రావ‌డం లేద‌ని అడిగిన ప్ర‌శ్న‌ స‌మంజ‌స‌మే. ఇంత మంచి రచయితలు ఉన్న పరిశ్రమలో ఆసక్తికరమైన మహిళా పాత్రలు ఎందుకు రాయలేదు అని ప్ర‌శ్నించాలి. క‌థ‌ల్లో అలాంటి పాత్ర‌లు ఉండ‌టం లేదా అని అడ‌గ‌డం క‌రెక్ట్. పెద్ద సంఖ్యలో సినిమాలు ఉన్నప్పటికీ అందులో అన్ని వర్గాల పాత్రలు లేనప్పుడు, ఆ సినిమాలో ఏదో లోటు ఉన్న‌ట్లే లెక్క‌” అని అన్నారు క‌స్రుతి. 


పుచ్చ‌కాయ బ్యాగు ర‌చ్చ‌.. 


కేన్స్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ లో క‌స్రుతి ఒక బ్యాగ్ ని ప‌ట్టుకున్నారు. అదే పుచ్చ‌కాయ బ్యాగ్. పుచ్చాకాయ‌ను పోలి ఉన్న బ్యాగ్ తో ఆమె రెడ్ కార్పెట్ పై న‌డిచారు. పాల‌స్తినాకి సంఘీభావంగా ఆమె ఆ బ్యాగ్ ప‌ట్టుకున్నారు. అయితే, దానిపై కూడా సోష‌ల్ మీడియాలో కాంట్ర‌వ‌ర్సీ న‌డిచింది . ఆమె పాల‌స్తీనాపై క‌ప‌ట ప్రేమ చూపిస్తున్నారు అంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దానిపై స్పందించింది క‌స్రుతి. “అక్క‌డ చాలామంది చాలా వాటికి స‌పోర్ట్ చేశారు. బ్యాడ్జెస్ వేసుకున్నారు. ర‌క‌ర‌కాల వస్తువులతో త‌మ సంఘీభావాన్ని తెలిపారు. నేను పాల‌స్తీనాకి సంఘీభావం తెల‌పాలి అనుకున్నాను. చాలామంది వ‌ర్క్ ప్లేసుల్లో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దారుణాల గురించి, కేన్స్ లో వ‌ర్క‌ర్ల‌కు ఇస్తున్న త‌క్కువ జీతాల గురించి ఇంకా చాలా విష‌యాల‌పై గొంతెత్తారు. నేను పాల‌స్తీనా కి సంఘీభావం తెల‌పాలి అనుకున్నాను అంతే” అని పేర్కొంది. 


Also Read: బాలకృష్ణ, అంజలి కలిసి నటించిన మూవీ ఏంటో తెలుసా? అందుకే తోశారంటున్న ఫ్యాన్స్!