Karan Johar Opens Up On Bollywood Crisis: ఓ భారీ హిట్టు కోసం బాలీవుడ్ తెగ వెయిట్ చేస్తోంది. ఆ మధ్య షారుక్ ఖాన్ జవాన్‌తో కాస్తంత ఊపిరి పీల్చుకుంది. అది కూడా సౌత్ డైరెక్టర్ అట్లీ చేసిన సినిమానే. అందుకే పూర్తిగా ఇది మా సినిమా అని చెప్పుకోలేని పరిస్థితి బాలీవుడ్‌ది. సౌత్ సినిమాలు వరుస పెట్టి బాక్సాఫీస్‌పై అటాక్ చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతుంటే బాలీవుడ్ మాత్రం డల్ అయిపోయింది. నెపోటిజం విమర్శలూ ఎదుర్కొంటోంది ఈ సినీ పరిశ్రమ. ప్రస్తుత పరిస్థితులపై కరణ్ జోహార్ (Karan Johar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. థియేట్రికల్ సక్సెస్‌కి డెఫినేషన్ మార్చాల్సిన అవసరముందని తేల్చి చెప్పాడు. అంతే కాదు. బాలీవుడ్‌లో చాలా మార్పులు రావాలనీ అన్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశాడు. "ఆడియెన్స్ చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు. వాళ్లు చూడాలనుకున్న సినిమాలే చూస్తున్నారు. వాళ్లను దృష్టిలో (Bollywood Crisis) పెట్టుకుని సినిమాలు తీస్తున్నా అవి మల్టీప్లెక్స్‌లకే పరిమితమవుతున్నాయి. A,B,C సెంటర్లలో ఆడడం లేదు. కేవలం మల్టీప్లెక్స్‌లు మాత్రమే ఇండస్ట్రీని కాపాడలేవుగా" అని అన్నాడు కరణ్.
సినిమా మేకింగ్ ఖర్చు గతంతో పోల్చుకుంటే భారీగా పెరిగిపోయిందంటూనే పేర్లు చెప్పకుండా బాలీవుడ్ బిగ్‌షాట్స్‌పై సెటైర్లు వేశాడు. "ఇండస్ట్రీలో 10 మంది హీరోలున్నారు. వాళ్ల సినిమా తీయాలంటే వాళ్ల గొంతెమ్మ కోరికలన్నీ తీర్చాలి. వాళ్లకి రెమ్యునరేషన్ ఇవ్వగానే మార్కెటింగ్ మొదలు పెట్టాలి. అదో భారీ ఖర్చు. ఇంతా చేస్తే ఆ సినిమా ఆడదు. సినిమాకి రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల సినిమాలకు కనీసం రూ.3.5 కోట్ల ఓపెనింగ్స్ కూడా రావడం లేదు" అని అసహనం వ్యక్తం చేశాడు కరణ్ జోహార్. ఇదంతా జరుగుతున్నప్పటికీ సినిమాలు తీయక తప్పదని, ఇండస్ట్రీలో అందరూ బతకాలంటే అంతకు మించి మరో మార్గం లేదని చెప్పాడు.
"జవాన్, పఠాన్ సినిమాలు వర్కౌట్ అయ్యాయని అవే జానర్‌లో సినిమాలు తీసుకుంటూ పోవాలనుకుంటాం. ఉన్నట్టుండి ఇంకేదో లవ్‌స్టోరీ వచ్చి హిట్ అయిపోతుంది. అప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతాం. దేనికోసం మేం ఇంత ఆరాటపడుతున్నామో అర్థం కాదు. క్రిటిక్స్ గురించి పట్టించుకోకుండా కేవలం ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలని మాత్రమే సినిమాలు తీయాలి. ఇండియన్ రూట్స్ ఉన్న సినిమాలనే ఆడియన్స్ ఎక్కువగా కోరుకుంటున్నారని తెలుసుకోడానికి మాకు చాలా సమయం పట్టింది" అని క్లారిటీ ఇచ్చాడు కరణ్. కేవలం సిటీ కల్చర్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని రిచ్‌గా సినిమాలు తీస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని తేల్చి చెప్పాడు. టెయిర్ -2 సిటీలు, గ్రామాల్లోని మూవీ లవర్స్‌కి ఈ కథలు పెద్దగా ఎక్కడం లేదని అన్నాడు. ఇలాంటి సినిమాలకు ఏ మాత్రం బిజినెస్ జరగడం లేదని అసహనం వ్యక్తం చేశాడు కరణ్. బాలీవుడ్ గురించి ఇంత ఓపెన్‌గా ఎప్పుడూ కరణ్ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది. కాగా కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన Kill మూవీ ఇటీవలే విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపిస్తోంది. మెల్లగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి.