కన్నడ సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ‘కాంతార’ సినిమా, తెలుగు, హిందీల్లోనూ సంచలనాలను నమోదు చేస్తున్నది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాలో నటించడంతో పాటు తెరకెక్కించాడు కూడా. కన్నడలో సెప్టెంబర్ 30న సినిమా విడుదల అయ్యింది. పదిహేను రోజుల తర్వాత ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. నెల రోజులు దాటక ముందే అన్ని భాషల్లో వసూళ్లు 200 కోట్ల రూపాయలు దాటినట్లు సమాచారం.  


సినిమాకు బలం నవ యువకుడి గాత్రం


ఇక తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పటి వరకు సిద్ శ్రీరామ్ పాటలను విని తరలించే వాళ్లు. ఇప్పుడు సినీ జనాలకు మరో సరికొత్త వాయిస్ దొరికింది. ‘కాంతార’ సినిమాలో ‘వరాహ రూపం’ అనే పాటని అద్భుతంగా ఆలపించాడు ఓ నవ యువకుడు. ‘కాంతార’ సినిమా చూసిన ప్రతి ఒక్కరు. ‘వరాహ రూపం’ అనే పాట ఎవరు పాడారు అని ఆరా తీయగా.. నెటిజన్లకు ఆ యువ గాయకుడి గురించి తెలిసింది. ఇంతకీ ఆ సింగర్ ఎవరో కాదు సాయి విఘ్నేష్. సాయి పాట వింటుంటే మళ్ళీ కర్ణాటక సంగీత కళాకారులకు మంచి రోజులు వచ్చినట్టే అనే ఆశ కలుగుతున్నది.  


బహుముఖ కళాకారుడు సాయి విఘ్నేష్   


సాయి విఘ్నేష్..  యువ బహుముఖ కళాకారుడు. చిన్న నాటి నుంచే సంగీత శిక్షణతో గాయకుడిగా మంచి గుర్తింపు పొందాడు.  లక్ష్మీ అనంతకృష్ణన్ తో పాటు కడలూరు శ్రీ .టి.ఆర్ వాసుదేవన్  దగ్గర సంగీతంలో  శిక్షణ తీసుకున్నాడు. ఆల్ ఇండియా రేడియో B -హై గ్రేడ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నది. భారత ప్రభుత్వానికి సంబంధించిన ICCR ఎంప్యానెల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. ప్రముఖ లైట్ మ్యూజిక్ రియాలిటీ షో (ఎయిర్‌టెల్ సూపర్ సింగర్ సీజన్ 4)లో పాల్గొన్నాడు. ప్రస్తుతం  ఔత్సాహిక గాయకులకు శిక్షణ ఇస్తున్నాడు.


జయ టీవీలో ప్రసారం అయ్యే ‘స్టార్ సింగర్’ మెంటర్ గా కొనసాగుతున్నాడు.  ‘ఏఘాంతం’ సినిమాలో గణేష్ రాఘవేంద్ర స్వరపరిచిన "ఊర నెంజిలా" పాటతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ‘కడై కుట్టి సింగం’ సినిమా కోసం డి.ఇమ్మాన్ స్వరపరిచిన "కాళై థీమ్" పాటను అద్భుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖ సంగీత దర్శకులకు పాటలు పాడుతున్నాడు. తాజాగా ‘సీతారామం’ సినిమాలో విశాల్ చంద్రశేఖర్ స్వరపరచిన   "కురుముగిల్",  ‘కాంతార’ సినిమాలో "వరాహ రూపం" పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఎన్నో అవార్డులు అందుకున్న సాయి


శంకర్ మహదేవన్ అకాడమీ నిర్వహించిన "సింగ్ విత్ శంకర్ మహదేవన్ కాంటెస్ట్ 2014"లో సాయి విఘ్నేష్  విన్నర్ గా నిలిచాడు.  బెంగుళూరులో Mr. శంకర్ మహదేవన్‌తో కలిసి ప్రదర్శన ఇచ్చే అవకాశాన్ని పొందాడు. సాయి విఘ్నేష్ ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి పలు ప్రదర్శనలు ఇచ్చాడు.  2019 సంవత్సరానికి గాను కర్ణాటక సంగీతంలో ముంబై షణ్ముగానంద సభ భారతరత్న డాక్టర్ M. S. సుబ్బులక్ష్మి ఫెలోషిప్ అవార్డును కూడా అందుకున్నాడు.


Also Read: ‘కాంతార’ సినిమా చూస్తూ ప్రేక్షకుడు మృతి