నటుడు రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కన్నడ లో విడుదల అయిన ఈ సినిమా అక్కడ భారీ హిట్ అవ్వడంతో ఇతర భాషల్లోనూ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా దేశం మొత్తం అలజడి సృష్టిస్తోంది. ఇండియన్ బాక్స్ ఆఫీసు వద్ద 'కాంతార' సినిమా వీరతాండవం చేస్తుందనే చెప్పాలి. ఇలా చెప్పడానికి కాంతార సినిమా లెక్కలే కారణం. హిందీలో విడుదల అయిన డబ్బింగ్ సినిమాలను కాంతార ఇప్పుడు బీట్ చేస్తోంది. హిందీ బాక్స్ ఆఫీస్ లెక్కలు చూస్తే కన్నడ స్టార్ యష్ నటించిన 'కేజీఎఫ్2' సినిమా వసూళ్లను కూడా కాంతార హిందీలో క్రాస్ చేసిందనే చెప్పాలి.
ఈ మధ్య దక్షిణాది సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. కొన్ని దక్షిణాది సినిమాలు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. 'కార్తికేయ 2' సినిమా దేశవ్యాప్తంగా మంచి టాక్ తెచ్చుకొని తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత దక్షిణాది సినిమా గా 'కాంతార' సినిమా హిందీ లోనూ దూసుకుపోతోంది. అక్టోబర్ 14 న విడుదలైన కాంతార హిందీ వెర్షన్ 17 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతానికి, ఈ సినిమా హిందీలో మొత్తం 42.95 కోట్లను రాబట్టింది. హిందీ వెర్షన్‌కు బ్రేక్-ఈవెన్ 7.5 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే, ఈ చిత్రం ఇప్పటి వరకు 35.45 కోట్ల లాభాలను ఆర్జించింది. దీని శాతానికి మార్చినట్లయితే, అది భారీ 472.66%కి సమానం. ఇది నిజంగా చాలా గొప్ప విజయమనే చెప్పాలి. కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ 382.91 శాతం ఉండగా కాంతార సినిమా దాన్ని బ్రేక్ చేసింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కాంతార సినిమా కార్తికేయ 2 హిందీ వెర్షన్ లో సాధించిన 566.66 వసూళ్ల శాతాన్ని కూడా అధిగమిస్తుందని ఫిల్మ్ వర్గాల అంచనా. అయితే హిందీ వెర్షన్ లలో అత్యధిక శాతం వసూళ్లు సాధించిన సినిమా గా 'ది కాశ్మీరీ ఫైల్స్' సినిమా 1162 శాతంతో ముందు వరుసలో ఉంది.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. కరోనా తర్వాత బాలీవుడ్ కి కాలం కలిసి రానట్టుంది. అక్కడ భారీ ప్రాజెక్టు సినిమాలు కూడా వరుస పరాజయాల పాలవుతున్నాయి. ఇదే సమయంలో దక్షిణాది సినిమాలు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. దీంతో బాలీవుడ్ స్టార్ లు కూడా దక్షిణాది పై దృష్టి పెట్టారు. అందుకే బాలీవుడ్ సినిమాలను ఇక్కడ విడుదల చేయడమే కాకుండా దక్షిణాది సూపర్ హిట్ సినిమాలను వరుసాగా రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లో సూపర్ హిట్ సినిమాలను బాలీవుడ్ స్టార్ లు రీమేక్ కు సిద్ధం చేస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్, విక్రమ్, కేజీఎఫ్ 2, కార్తికేయ 2, కాంతార లాంటి సినిమాలు బాలీవుడ్ ను షేక్ చేశాయి. దీంతో దక్షిణాది మార్కెట్ పై కూడా బాలీవుడ్ దృష్టి సారించింది.
Also Read : ఈ వారం చిన్న సినిమాలదే హవా - థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్ ఇవే!