నిత్యానంద స్వామి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. స్వామిజీగా కలరింగ్ ఇస్తూ, పలు నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. భారత్‌లో కిడ్నాప్, అత్యాచారం వంటి పలు కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. అత్యాచార ఆరోపణలు తీవ్రం కావడంతో, 2019లో దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత ఓ ద్వీపంలో ప్రత్యక్షం అయ్యారు. దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే పేరు పెట్టారు. ఆయనే ఓ దేశంగా ప్రకటించుకున్నారు. ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీతో పాటు ప్రభుత్వ పాలనను ఏర్పాటు చేశారు.
కైలాస దేశ ప్రధానిగా రంజిత
తాజాగా కైలాస దేశం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రధాన మంత్రిగా తన ప్రియ శిష్యురాలు అయిన రంజితను నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసినట్లు ఓ తమిళ పత్రిక ప్రకటించింది. అంతేకాదు, నిత్యానంద వెబ్ సైట్ లోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. ఈ వార్త బయటకు తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నిత్యానంద వెబ్ సైట్ లో నిత్యానందతో పాటు, రంజిత ఫోటోలు మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. రంజిత తన పేరును సైతం మార్చుకుంది. నిత్యానందమయి స్వామిగా ప్రకటించుకుంది. మొత్తంగా హిందువుల కోసం ఏర్పాటు అయిన కైలాస దేశానికి రంజిత తొలి ప్రధానిగా నియమితం అయ్యింది.
ఐరాస సమావేశాల్లో పాల్గొన్న కైలాస ప్రతినిధులు
అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశానికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఐక్యరాజ్య సమితి సమావేశాలకు కైలాస దేశం నుంచి కొంత మంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అసలు నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ కైలాస దేశం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కానీ, సోషల్ మీడియా పుణ్యమా అని బాగా పాపులర్ అయ్యింది. నిత్యానందకు సంబంధించిన ప్రతి విషయం ఇట్టే వైరల్ అవుతోంది.
ఇంతకీ రంజిత ఎవరు?
రంజిత ఒకప్పుడు సౌత్ తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులకు సొంత చేసుకుంది. సౌత్ సినిమా పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆమె సినీ కెరీర్ మంచి ఫీక్స్ లో ఉన్న సమయంలోనే సినిమాకు స్వస్తి పలికింది. స్వామి నిత్యానంద దరికి చేరింది. ఆయనకు ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరి రాసలీలల వ్యవహారం బయటకు రావడంతో నిత్యానంద పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ తర్వాత దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం ఓ ద్వీపంలో తన కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. దానికి కైలాస దేశంగా నామకరణం చేశారు. కొద్ది కాలం క్రితం ఈ దేశం తరుపున ఐక్యరాజ్య సమితి సమావేశంలో మహిళా రాయబారులు పాల్గొని సంచలనం సృష్టించారు. తర్వాత జరుగబోయే సమావేశాలకు రంజిత ప్రధాని హోదాలో వెళ్లే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Also: పాక్ క్రికెటర్‌తో తమన్నా పెళ్లా? మరి విజయ్ వర్మ పరిస్థితి ఏంటి?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial