నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణను కడసారి చూసేందుకు, ఆయన చివరి చూపు కోసం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు తరలి వచ్చారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా కృషి చేస్తానని ఎంపీ బాలశౌరి తెలిపారు.
కైకాల స్వగ్రామంలో కమ్యూనిటీ హాల్
కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) నటుడిగానే కాదు, ఎంపీగానూ సేవలు అందించారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ఎన్టీఆర్ తోడుగా, ఆయన వెంట ఉన్నప్పటికీ... చాలా ఏళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలేదు. నారా చంద్రబాబు నాయుడు బలవంతం చేయడంతో 1996లో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి సేవలు అందిస్తున్నారు. కైకాల మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మహాప్రస్థానంలో దివంగత నటుడి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కైకాల పేరు చిరస్థాయిగా గుర్తుండేలా చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
బాలశౌరి (Vallabhaneni Balasouri) మాట్లాడుతూ ''కైకాల సత్యనారాయణ గారు వ్యక్తిగతంగా నాకు పరిచయం. గుడివాడలో ఆయన పేరు మీద కళాక్షేత్రం ఉంది. దానిని అభివృద్ధి చేయడంతో పాటు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక పార్లమెంట్ సభ్యునిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆయన స్వగ్రామం కౌతరంలో ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించటానికి సాయం చేస్తాను'' అని చెప్పారు.
పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలనే తారతమ్యాలు లేకుండా దాదాపు ఆరు దశాబ్దాల పాటు నటుడిగా సేవలు అందించిన గొప్ప వ్యక్తి కైకాల అని బాలశౌరి చెప్పారు. కైకాల లేని లోటు భర్తీ చేయడం కష్టమన్నారు. చిత్రసీమలో, రాజకీయాల్లో ఆయనకు మంచి వ్యక్తిగా ఎంతో పేరుందన్నారు. బాలశౌరితో పాటు కైకాలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు దాసరి కిరణ్ కుమార్ నివాళులు అర్పించారు.
Also Read : నటుడిగా కైకాల ప్రయాణంలో మజిలీలు - సత్యనారాయణ సమగ్ర సినిమా చరిత్ర
కైకాల సత్యనారాయణ పార్థీవ దేహాన్ని నిర్మాత అల్లు అరవింద్ చితి వరకు మోసుకుంటూ వెళ్లి తుది నివాళులు అర్పించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నటి - దర్శకురాలు జీవితా రాజశేఖర్, నిర్మాతలు ఏడిద రాజా, పి. సత్యారెడ్డి, దర్శకులు నక్కిన త్రినాధరావు, రాజా వన్నెం రెడ్డి, నటుడు & డాక్టర్ మాదాల రవి, ప్రజా గాయకుడు గద్దర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నటి ఈశ్వరీ రావు, తదితరులు తుది నివాళులు అర్పించారు.
తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో శనివారం కైకాల సత్యనారాయణ అంతిమ కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని స్వగృహం నందు ఉంచారు. శనివారం ఉదయం ఇంటి దగ్గర నుంచి అంతిమ యాత్ర ప్రారంభమై జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానం చేరుకుంది. కైకాల చితికి ఆయన పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ అశ్రు నయనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Also Read : గ్యాంగ్ లీడర్‌ను గుర్తు చేస్తున్న వీరయ్య - టైటిల్ సాంగ్‌తో రఫ్ఫాడించడానికి రెడీ