అంతర్జాతీయ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం పై యావత్ భారత దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక మూవీ టీమ్ ఆనందానికైతే అవధులే లేవు. అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చిన తర్వాత సింగర్ కాల భైరవ ఆస్కార్ వేదికపై లైవ్ ప్రదర్శన ఇవ్వడం పట్ల స్పందిస్తూ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటకు లైవ్ ప్రదర్శన ఇవ్వడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు కాల భైరవ. సినిమా దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఎస్ఎస్ కార్తికేయ వారి కృషి వల్ల ఈ పాట ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చేరుకుందని అన్నారు. అలాగే అమెరికాలో గ్లోరియస్ రన్ కోసం డైలాన్, జోష్ టీమ్ శ్రమ, అంకిత భావం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. అందుకు పత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఓ సుధీర్ఘ నోట్ ను రాసుకొచ్చారు.
సింగర్ కాల భైరవ చేసిన పోస్ట వైరల్ అవడంతో దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఆయన చేసిన పోస్ట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో చరణ్, ఎన్టీఆర్ అభిమానులు కాల భైరవపై ఫైర్ అవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు అంత కష్టపడి డాన్స్ చేయకపోతే ఈ పాటకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేదా? వారిద్దరూ కలసి ప్రపంచ వ్యాప్తంగా తిరిగి ప్రమోషన్స్ చేయకపోతే పాటకు ఆస్కార్ వచ్చేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. అయితే తాజాగా కాల భైరవ దీనిపై స్పందిస్తూ మరో నోట్ రాసుకొచ్చారు.
కాల భైరవ వివరణ ఇస్తూ.. ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్, ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంలో తారక్, చరణ్ అన్నలే కారణమని చెప్పడంలో తనకు ఎలాంటి సందేహం లేదన్నారు కాల భైరవ. అయితే ఆస్కార్ వేదికపై తాను లైవ్ పెర్ఫార్మెన్స్ ఛాన్స్ రావడం కోసం ఎవరెవరు సహకరించారో వారి గురించే తాను ప్రత్యేకంగా మాట్లాడానని అన్నారు. అంతే కాని అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదని చెప్పారు. అయితే దీన్ని వేరేలా అర్థం చేసుకున్నారని తనకు అర్థమైందని. అందుకు తాను ప్రత్యేకంగా క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. దీంతో కాల భైరవపై వస్తోన్న నెగిటివ్ కామెంట్లకు పులిస్టాప్ పడింది. ఏదేమైనా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం, ఆ పాటను అంతర్జాతీయ వేదికపై లైవ్ ప్రదర్శన ఇవ్వడం నిజంగా భారతీయులకు గర్వకారణమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు పలువురు నెటిజన్స్.
ఇక అమెరికాలోని డాల్బీ థియేటర్ లో మార్చి 13 న ఆస్కార్ అవార్డుల వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ప్రపంచ స్థాయిలో నటీనటులు హాజరయ్యారు. విశ్వవేదికపై ‘నాటు నాటు’ పాట లైవ్ ప్రదర్శనతో ఆస్కార్ వేదిక దద్దరిల్లింది. ఈ పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ అంతర్జాతీయ వేదిక పై లైవ్ లో పాడి ఔరా అనిపించారు. ఈ వేడుకల తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఇండియాకు చేరుకుంది.
Also Read : బుర్ర పాడు చేసే డిస్టర్బింగ్ ట్విస్ట్‌తో వచ్చిన లేటెస్ట్ మలయాళం మూవీ ‘ఇరట్టా’ - ఎలా ఉందంటే?