భారత్‌లో అదిరిపోయే కన్సర్ట్..


ఇంగ్లీష్ పాటలు అప్పుడప్పుడే ఫేమస్ అవుతున్న రోజుల్లో లిరిక్స్ పూర్తిగా వచ్చినా రాకపోయినా పాడిన పాట "బేబీ బేబీ బేబీ ఓ". కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ పాడిన ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషన్. భారత్‌లోనూ బీబర్‌కు ఈ పాట ఎంతో పాపులారిటీ తెచ్చి పెట్టింది. చాలా మంది ఈ పాటను రింగ్‌టోన్‌గా కూడా పెట్టుకున్నారు. అప్పటి నుంచి జస్టిన్ బీబర్ చేసిన ప్రతి ఆల్బమూ హిట్టే. చాలా చిన్న వయసులోనే ఫేమస్ అయిపోయాడు. ఇతని స్టేజ్‌షోలకు కూడా మ్యూజిక్ లవర్స్‌ భారీ సంఖ్యలో వచ్చేస్తారు. ఏ దేశంలో చేసినా, మనోడికి ఫాలోయింగ్ తక్కువేమీ ఉండదు. ఇప్పుడు భారత్‌ అభిమానులనూ అలరించేందుకు సిద్ధమవుతున్నాడు జస్టిన్ బీబర్. త్వరలోనే దేశ రాజధాని దిల్లీలో కన్సర్ట్ నిర్వహించనున్నాడు. కొద్ది రోజులు ఫేస్ పెరాల్సిస్‌తో బాధ పడుతున్న జస్టిన్ బీబర్, నార్త్ అమెరికాలోని కన్సర్ట్‌ని క్యాన్సిల్ చేశాడు. కొంత కాలం గ్యాప్ తరవాత మళ్లీ వరల్డ్‌ టూర్ మొదలు పెట్టనున్నాడు. అందులో భాగంగానే అక్టోబర్ 18న దిల్లీలో కన్సర్ట్ చేయనున్నాడు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ కన్సర్ట్ జరగనుంది. టికెట్ ధర రూ.4,000 నుంచి ప్రారంభమవుతుంది. 


ఫేస్ పెరాల్సిస్‌తో బాధ పడుతున్నా...


మరో అమెరికన్ సింగర్ ఉషర్...జస్టిన్ బీబర్ వరల్డ్‌ టూర్‌పై స్పందించారు. ఈ మధ్యే ఓ వెకేషన్‌లో బీబర్‌ను కలిశానని చెప్పారు. "ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి అభిమానుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ చాలా అవసరం" అని అన్నారు. బీబర్..ఫేస్ పెరాల్సిల్‌తో బాధ పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు. ఈ వ్యాధి వల్ల ఆయన ముఖంలోని కుడివైపు భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. తాను ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ బీబర్ జూన్ 11న తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘‘నా కన్ను ఒకటి కొట్టుకోవడం లేదు. నా ముఖంలో ఒక వైపు నుంచి నవ్వలేకపోతున్నా. నా ముఖంలో ఒక వైపు పూర్తిగా పక్షవాతానికి గురైంది’’అని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన టూర్స్, ఈవెంట్స్‌ను రద్దు చేసుకున్నాడు. ఈ వీడియో చూసి బీబర్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఫిట్‌నెస్ విషయంలో ఎంతో కచ్చితంగా ఉండే బీబర్‌కు ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.