Jr NTR, Yash, Manchu Vishnu Congratulated Rishab Shetty: చిన్న సినిమాగా విడుదలై దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకున్న కన్నడ చిత్రం ‘కాంతార‘. ఈ సినిమాలో అద్భుత నటనతో అలరించిన నటుడు రిషబ్ శెట్టికి కేంద్ర ప్రభుత్వం సముచిత గౌరవాన్ని అందించింది. 2022 ఏడాదికి గాను ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో... ఆయనను జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపిక చేశారు. 69వ నేషనల్ ఫిల్మ్‌ అవార్డులలో అల్లు అర్జున్ ‘పుష్ప‘ సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకోగా, ఈసారి రిషబ్ శెట్టి దక్కించుకున్నారు. వరుసగా రెండు అవార్డులు సౌత్ హీరోలకు రావడం పట్ల ఇక్కడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


రిషబ్ శెట్టికి ఎన్టీఆర్, యశ్ అభినందనలు


జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టిపై పాన్ ఇండియన్ యాక్టర్లు జూనియర్ ఎన్టీఆర్, యష్ అభినందించారు. అవార్డుల ప్రకటన అనంతరం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ‘కన్నడ సినిమా షైనింగ్ మూమెంట్’ అంటూ ప్రశంసించారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందేందుకు రిషబ్ శెట్టికి అన్ని అర్హతలు ఉన్నాయంటూ అభినందించారు. “రిషబ్ శెట్టికి శుభాకాంక్షలు. ‘కాంతార’ చిత్రానికి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ఆ అవార్డు పొందేందుకు నీకు అన్ని అర్హతలు ఉన్నాయి. ‘కాంతార’లో మైండ్ బ్లోయింగ్ ఫర్మార్మెన్స్ తో గూస్ బంప్ప్ తెప్పించావు. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు అందుకున్న ‘కాంతార’ చిత్రబృందానికి అభినందనలు” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.






అటు జాతీయ అవార్డులు అందుకున్న వారందరికీ యష్ అభినందనలు తెలిపారు. “జాతీయ అవార్డుల అందుకున్న నటీనటులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రత్యేకంగా రిషబ్ శెట్టి, కిరగందూర్, ప్రశాంత్ నీల్ తో పాటు హొంబలే ఫిల్మ్స్ టీమ్ లో భాగమైన ‘కాంతార’, ‘కేజీఎఫ్ 2’ టీమ్ కు  అభినందనలు. మరెంతో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నాను. జాతీయ స్థాయిలో కన్నడ సినిమా మెరవడం సంతోషంగా ఉంది” అంటూ యష్ రాసుకొచ్చారు.






రిషబ్ శెట్టికి మా అధ్యక్షుడు మంచు విష్ణు అభినందనలు తెలిపారు. ‘కాంతార’లో అతని అసాధారణ నటనకు గాను ఆయన జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఆయన ఈ అవార్డును అందుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘కార్తికేయ 2’ చిత్రబృందానికి నా అభినందనలు. ఇతర జాతీయ అవార్డు విజేతలకు అభినందనలు తెలిపారు.






అటు తనకు అభినందనలు చెప్పిన ప్రతి ఒక్కరికి  నటుడు రిషబ్ శెట్టి ధన్యవాదాలు చెప్పారు.  


చిన్న సినిమాగా విడుదలై.. పాన్ ఇండియా స్థాయిలో విజయం


కన్నడ సినిమా పరిశ్రమలో చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించింది ‘కాంతార’. ఈ చిత్రంలో తనే నటించడంతో పాటు, దర్శకత్వం వహించారు రిశబ్ శెట్టి. తొలుత కన్నడలో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఆ తర్వాత తెలుగు, హిందీలోనూ విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట అద్భుత విజయాన్ని అందుకుంది. సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ, ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళు చేసి సత్తా చాటింది.    



Read Also:  కార్తికేయ - 2 చిత్రానికి జాతీయ అవార్డు, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి - నేషనల్ అవార్డుల మొత్తం లిస్ట్ ఇదే