Thangalaan Day 1 Box Office Collections: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, రియలిస్టిక్ చిత్రాల దర్శకుడు పా రంజిత్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘తంగలాన్‘. భారీ అంచనాల నడుమ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లుగానే తొలి షో నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పా రంజిత్ ఈ సినిమాను తెర మీద ముందుకు నడిపిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వందల ఏండ్ల ద్రవిడుల ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాలు, మత విధానాలను లింక్ చేస్తూ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ దేశ మూలవాసులైన ఆదివాసులు ఎలా దోచుకోబడ్డారు అనేది ఈ చిత్రంలో అత్యంత హృద్యంగా చూపించారు. కమర్షియల్ అంశాల జోలికిపోకుండా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది.


తొలి రోజు రూ. 26.44 కోట్ల గ్రాస్ వసూళు


కథలో దమ్ముంటే సినిమా అద్భుతంగా ఆడుతుందని అనడానికి ‘తంగలాన్’ నిదర్శనంగా నిలిచింది. మూస ధోరణికి విరుద్ధంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. తొలి రోజు అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 26.44 కోట్ల వసూళ్లతో దుమ్మురేపింది. ప్రాంతాల వారీగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ మూవీ రూ. 11 కోట్ల(15 కోట్ల గ్రాస్), తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.5(3 కోట్ల గ్రాస్), మలయాళంలో రూ. 20 లక్షలు, కన్నడలో రూ. 2.5 కోట్ల గ్రాస్ సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ రూ. 20 కోట్ల గ్రాస్ అందుకుంది. వరల్డ్ వైడ్‌ గా రూ. 26.44 కోట్ల గ్రాస్ సాధించి సత్తా చాటింది.






ఆగష్టు 30న నార్త్ లో విడుదల


‘తంగలాన్’ సినిమా నార్త్ లో ఇంకా రిలీజ్ కాలేదు.  ఉత్తరాదిన ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు. నార్త్ లో ఈ సినిమా లేకపోయినా, ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం పట్ల చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. మౌత్ టాక్ తో  కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ‘తంగలాన్’ సినిమాకు తెలుగులోనూ మంచి టాక్ లభించింది. తమిళ్, కన్నడ, మళయాల భాషల్లోనూ పాజిటివ్ మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.  


ప్రపంచ వ్యాప్తంగా 1600 స్క్రీన్లలో విడుదల


విక్రమ్ కెరీర్ లో 61వ చిత్రంగా తెరకెక్కిన తంగలాన్ పై మొదటి నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రపంచ వ్యాప్తంగా 1600 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగులో మూవీని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేసింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూబా బాగానే జరిగింది. తమిళంలో రూ.48 కోట్లు, తెలుగులో రూ. 6 కోట్లు, కన్నడలో రూ. 3 కోట్లు, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 1.5 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా ఈ సినిమా సుమారుగా రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది.



Read Also: కార్తికేయ - 2 చిత్రానికి జాతీయ అవార్డు, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి - నేషనల్ అవార్డుల మొత్తం లిస్ట్ ఇదే