Vedaa Movie Teaser Out: బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వేదా‘. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ హీరోయిన్‌గా నటిస్తున్నది. తమన్నా భాటియా, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోనీషా అద్వానీ, మధు భోజ్వాని, జాన్ అబ్రహాం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 12న విడుదలకు రెడీ అవుతోంది.
ఆకట్టుకుంటున్న ‘వేదా’ టీజర్
త్వరలో ‘వేదా‘ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో, కళ్లు చెదిరే యాక్టింగ్ తో జాన్ అబ్రహాం, శార్వరీ ఆకట్టుకుంటున్నారు. టీజర్ చూస్తుంటే యాక్షన్ ప్రియులను ఓ రేంజిలో అలరించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో జాన్ శార్వరికి గురువుగా నటిస్తున్నారు.
ప్రత్యేక పాత్రలో తమన్నా భాటియా
ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన తమన్నా భాటియా స్పెషల్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే సినిమాలు, ఓటీటీలతో ఫుల్ బిజీ అయిన ఆమె ఈ చిత్రంలో అమాయకురాలిగా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. గత ఏడాది ఆమె నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘జీ కర్దా’ మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇందులో ఆమె చేసిన ఇంటిమేట్ సీన్లు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ సినిమాలో ఓవైపు అమాయకురాలిగా కనిపిస్తూనే హై యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోంది. 'కల్ హో నా హో', 'సలామ్-ఎ-ఇష్క్', 'డి-డే', 'బాట్లా హౌస్' చిత్రాలకు దర్శకత్వం వహించిన అద్వానీ.. ఈ చిత్రంలో తమన్నా సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్ తో తనదైన ముద్ర వేసిందని వెల్లడించారు. ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు ఇప్పటికే దర్శకుడు నిఖిల్ వెల్లడించారు. సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబించబోతుందన్నారు. “తమన్నా నటన చాలా బాగుటుంది. ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేయాలని నేను అడిగినప్పుడు వెంటనే ఓకే చెప్పింది. ఆమె ఈ సినిమాలో ఆమె పాత్ర అద్భుతంగా ఉండబోతోంది” అని వెల్లడించారు.ఇక ఈ సినిమా గురించి మాట్లాడిన తమన్నా “నిఖిల్ కథలు చెప్పే విధానం నాకు చాలా నచ్చుతుంది. అతడి ఆలోచన విధానం సరికొత్తగా ఉంటుంది. జాన్ తో తొలిసారి కలిసి నటిస్తున్నాను. నా పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉంటుంది” అని చెప్పుకొచ్చింది.
అటు 'వేదా' సినిమా కథను అసీమ్ అరోరా అందించారు. జీ స్టూడియోస్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్, JA ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమన్నా చివరగా రజనీకాంత్ నటించిన ‘జైలర్’, చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భోలా శంకర్’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ‘అర్నామనై 4’ అనే తమిళ మూవీతో పాటు బాలీవుడ్‍లో ‘స్త్రీ 2’ మూవీస్ చేస్తోంది.
Read Also: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?