Jeethu Joseph: మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నెరు’. జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ (డిసెంబర్ 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా కథ విషయంలో కాపీ ఆరోపణలు ఎదురయ్యాయి.
‘నెరు’ మూవీపై కాపీ ఆరోపణలు
ఈ సినిమాలోని కథ, తన కథ నుంచి కాపీ కొట్టారంటూ ఓ రచయిత కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ సినిమాను నిలిపివేయలేమని న్యాయ స్థానం తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు జీతూ జోసెఫ్ కీలక వివరణ ఇచ్చారు.
దీపక్ ఉన్ని అనే రచయిత, ‘నెరు’ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్, రైటర్ శాంతి మాయాదేవి తన కథను దొంగిలించారని కేరళ హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటీషన్ లో రచయిత కీలక విషయాలు వెల్లడించారు. “జీతూ, శాంతితో కలిసి 2021లో ఈ సినిమా స్క్రిప్ట్ గురించి చర్చించాను. 49 పేజీల స్క్రిప్ట్ తమకు ఇవ్వాలని వారు నన్ను కోరారు. ఆ తర్వాత నన్ను కాదని వాళ్లే ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చూశాక నా కథ కొట్టివేశారని అర్థం అయ్యింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయడంతో పాటు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను” అని తెలిపారు. దీపక్ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ సినిమా విడుదలపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ కేసును డిసెంబర్ 22కు వాయిదా వేసింది.
కాపీ ఆరోపణలపై స్పందించిన దర్శకుడు జీతూ
తన చిత్రం ‘నెరు’పై వస్తున్న కాపీ ఆరోపణలపై దర్శకుడు జీతూ జోసెఫ్ స్పందించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. నిజాయితీతో తెరకెక్కించిన చిత్రంపై కాపీ ఆరోపణలు రావడం ఆవేదన కలిగిస్తుందన్నారు. “’నెరు’ చిత్రం ఇతర చిత్రాల మాదిరిగానే చాలా నిజాయితీతో తెరకెక్కించాను. సినిమా విడుదలకు ముందే వివాదం సృష్టించారు. నేను కథను కాపీ కొట్టానని ఆరోపించారు. కానీ, అదంతా అవాస్తవం. మీరు సినిమా చూసి ఏది నిజమో? ఏది అబద్దమో తెలుసుకోండి. అనవసర ఆరోపణలు చేసిన ‘నెరు’ చిత్రాన్ని అపకీర్తి పాలు చేయకండి” అని జీతూ వివరించాడు.
‘నెరు’ మూవీ గురించి..
మోహన్ లాల్ ఈ చిత్రంలో విజయ్ మోహన్ అనే న్యాయవాది పాత్రలో కనిపిస్తున్నారు. చాలా రోజులుగా కేసులు వాదించని ఒక లాయర్ సడన్ గా ఒక కేసు కోసం మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఆ తరువాత ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రం కోర్టు రూం డ్రామా నేపథ్యంలో ముందుకు సాగుతుంది.
Read Also: ప్రభాస్‌ను షారుఖ్‌తో పోల్చిన ప్రశాంత్ నీల్ - 20 ఫ్లాప్స్ వచ్చినా స్టార్ సారే!