Sudheer Babu's New Poster From Jatadhara: సరికొత్త కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవ దళపతి సుధీర్ బాబు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ (Jatadhara Movie). ఈ సినిమా వచ్చే ఏడాది శివరాత్రికి రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా మరో పోస్టర్ విడుదల అయ్యింది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా మేళవింపుగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. బుల్లెట్ మీద సుధీర్ బాబు వెళ్తుండగా, ఆయన వెనుక వైపున కాళికాదేవి ఉగ్రరూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. సూపర్ నేచురల్ శక్తితో సుధీర్ బాబు అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ లోనే ఇలా ఉంటే సినిమాలో ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో? అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ కు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయా-సుధీర్ బాబు
‘జటాధర’ సినిమా తన కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ గా ఉండబోతున్నట్లు సుధీర్ బాబు చెప్పారు. “‘జటాధర’ ఫస్ట్ లుక్ పోస్టర్ కు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయాను. ప్రేక్షకుల నుంచి ఇంత గొప్ప స్పందన రావడం సంతోషం కలిగించింది. ఈ సినిమా నాకు ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయికతో ఈ కథను రాశారు. ఈ రెండు జోనర్స్ కు చెందిన ప్రపంచాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. ఆడియెన్స్ ఈ సినిమా చూసి సరికొత్త అనుభూతి చెందుతారు. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పోస్టర్ పౌరాణిక ప్రపంచాన్ని తెలియజేస్తుంది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉండబోతున్నాయి” అని సుధీర్ బాబు వెల్లడించారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘జటాధర’
‘జటాధర’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నిర్మాతలు ప్రేరణ అరోరా, శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ ఈ సినిమా కోసం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు నెగెటివ్ రోల్ కు సంబంధించి కూడా బాలీవుడ్ యాక్టర్ ను తీసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ‘జటాధర’
‘జటాధర’ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. 2025లో విడుదలకు సిద్ధమవుతున్న ‘జటాధర’ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. రీసెంట్ గా ‘హరోం హర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుధీర్ బాబు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడింది. అక్టోబర్ 11న ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు.
Read Also: ‘దేవర’ చివరి 30 నిమిషాలు మరో లెవల్... ఆలియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ