‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ పంచ్ ప్రసాద్. తన అదిరిపోయే పంచ్ టైమింగ్స్ తో ఎంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో తన కామెడీ పంచులు విసిరాడు. ఆయన వేసే పంచులకు ప్రేక్షకులు పడిపడి నవ్వేవారు. ఎప్పుడూ జనాలను నవ్వించే పంచ్ ప్రసాద్ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కొద్ది నెలలుగా ఆయనకు కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు కామెడీల్లో పాల్గొనేవాడు. తన ఒంట్లోని నొప్పిని దాచుకుని అందరినీ నవ్వించే వాడు.   


వారం రోజుల క్రితం తిరగబెట్టిన కిడ్నీ సమస్య


వారం రోజుల క్రితం ప్రసాద్ కిడ్నీ సమస్య తిరగబెట్టింది. ఏకంగా నడవలేని స్థితిలోకి చేరుకున్నాడు. షూటింగ్ నుంచి వచ్చిన ఆయన జ్వరంతో పాటు నడవలేక బాధపడటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షలు చేసి కిడ్నీ సమస్య మరింత తీవ్రం అయ్యిందని చెప్పారు.  నడుము వెనక వైపు చీము పట్టిందని డాక్టర్లు వెల్లడించారు. ఇందుకు ఆయనకు శస్త్ర చికిత్స చేసినట్లు తెలుస్తోంది. పంచ్ ప్రసాద్ నడవలేని స్థితిలో ఉన్నట్లు కమెడియన్ నూకరాజు.. ఇటీవల యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ‘జబర్దస్త్’ అభిమానులు ప్రసాద్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.


ప్రస్తుతం ప్రసాద్ హెల్త్ ఓకే!


తాజాగా నూకరాజు, పంచ్ ప్రసాద్ కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగు పడిందని చెప్పాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన ప్రసాద్ కు సెలైన్ ద్వారా ఫ్లూయిడ్స్ అందిస్తున్నట్లు చెప్పాడు. ఓ నర్స్ దగ్గర ఉండి ఆయనకు కావాల్సిన మెడిసిన్స్ అందిస్తోంది. అటు ప్రసాద్ భార్య తనను సపర్యలు చేస్తోంది. వైబ్రేషన్ మిషన్ ద్వారా తన కాళ్లకు ఎక్సర్ సైజ్ అందిస్తోంది. అసియా, నూకరాజు కలిసి తాజాగా ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందంటూ లేటెస్ట్ వీడియోలో చెప్పారు.


సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పిన ప్రసాద్


తన ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి పంచ్ ప్రసాద్ కృతజ్ఞతలు చెప్పాడు. అందరి ఆశీస్సులు ఇలాగే ఉంటే తాను తిరిగి కోలుకుంటానని చెప్పాడు. అటు ప్రసాద్ చికిత్స కోసం ‘జబర్దస్త్’ కమెడియన్స్ తో పాటు పలువురు దాతలు సాయం చేశారు. ఈ సందర్భంగా వారందరికీ ప్రసాద్ థ్యాంక్స్ చెప్పాడు. మరోవైపు పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకుని మళ్లీ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే ప్రసాద్ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని డాక్టర్లు కూడా చెప్పారు. ప్రస్తుతం ఆయన వీలైనంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇంటి దగ్గరే కుటుంబ సభ్యులు, వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నాడు. త్వరలోనే మళ్లీ ప్రేక్షకులను నవ్విస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.



Read Also: ఆమెతో ప్రపంచాన్ని సృష్టిస్తాడట, యాంకర్‌ సౌమ్యపై ఆది డబుల్ మీనింగ్ పంచ్‌లు - అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్న రాఘవ