'2018' Movie Out Of Oscar Race: 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కోసం భారత్ నుంచి అధికారికంగా ఎంపిక చేసిన మలయాళ చిత్రం ‘2018’కి నిరాశ ఎదురయ్యింది. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం’ విభాగం కోసం పంపించిన ఈ చిత్రం ఆస్కార్ కమిటీ షార్ట్ లిస్టులో స్థానం దక్కించుకోలేకపోయింది. గత ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును అందుకోగా, ఈసారి కూడా భారత్‌కు మంచి ప్రయారిటీ ఉంటుందని భావించారు. కానీ, మొదటి అడుగులోనే నిరాశ ఎదురయ్యింది. ‘2018’ సినిమా 96వ అకాడమీ అవార్డుల రేసు నుంచి అవుట్ అయ్యింది.
కేరళ వరదల ఆధారంగా తెరకెక్కిన ‘2018’
2018 కేరళ వరదలను బేస్ చేసుకుని దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్ హృదయాలకు హత్తుకునేలా ఈ సినిమా తీశారు. టోవినో థామస్ హీరోగా నటించాడు. ఇందులోని ప్రతి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. కేరళలో ఈ చిత్రం వందకోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగు నుంచి ‘దసరా‘, ‘బలగం‘ కూడా ఆస్కార్ ఎంట్రీకి దరఖాస్తు చేసుకున్నా వాటికి నిరాశ ఎదురయ్యింది. ‘2018‘ చిత్రానికి ముందు, మలయాళ చిత్రాలు గురు (1997), అదామింటే మకాన్ అబు (2011), జల్లికట్టు (2019) ఆస్కార్‌లకు భారత్ నుంచి అధికారిక ఎంట్రీ ఇచ్చాయి. అయితే, ఈ చిత్రాలేవీ నామినేట్ కాలేదు.
2024 ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడే చిత్రాల షార్ట్ లిస్ట్ విడుదల
తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్స్ 2024 కోసం పోటీ పడే చిత్రాల షార్ట్ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ సౌండ్‌తో సహా 10 విభాగాల్లో చిత్రాలను ఎంపిక చేసింది.
'ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం' విభాగంలో 15 చిత్రాలు ఎంపిక
ఈ సంవత్సరం 'ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం' కేటగిరీకి 15 సినిమాలను షార్ట్ లిస్ట్ చేశారు. వాటిలో ‘అమెరికాట్సీ‘ (అర్మేనియా), ‘ది మాంక్ అండ్ ది గన్‘ (భూటాన్), ‘ది ప్రామిస్డ్ ల్యాండ్‘ (డెన్మార్క్), ‘ఫాలెన్ లీవ్స్‘ (ఫిన్లాండ్), ‘ది టేస్ట్ ఆఫ్ థింగ్స్‘ (ఫ్రాన్స్), ‘టీచర్స్ లాంజ్‘ (జర్మనీ), ‘గాడ్‌ల్యాండ్‘ (ఐస్‌లాండ్), ‘లో కాపిటానో‘ (ఇటలీ), ‘పర్ఫెక్ట్ డేస్‘ (జపాన్), ‘టోటెమ్‘ (మెక్సికో), ‘ది మదర్ ఆఫ్ ఆల్ లైస్‘ (మొరాకో), ‘సొసైటీ ఆఫ్ ది స్నో‘ (స్పెయిన్), ‘ఫోర్ డాటర్స్‘ (ట్యునీషియా), ’20 డేస్ ఇన్ మారియుపోల్‘ (ఉక్రెయిన్), ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్‘ (యునైటెడ్ కింగ్‌డమ్) స్థానం సంపాదించుకున్నాయి.
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ లిస్టులో 'టు కిల్ ఎ టైగర్'
ఇక జార్ఖండ్ గ్యాంగ్‌రేప్ కేసు ఆధారంగా తీసిన 'టు కిల్ ఎ టైగర్' అనే డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో షార్ట్ లిస్ట్ చేశారు. ఈ చిత్రానికి టొరంటోకు చెందిన డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ నిషా పహుజా దర్శకత్వం వహించారు.
Read Also: ‘సలార్‘ టీమ్ దెబ్బకు దిగొచ్చిన పీవీఆర్, ఐనాక్స్ - ఇక ఫ్యాన్స్‌కు పండగే