Indian Idol 12 Finale Highlights: పాపులర్ సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్' విజేతగా పవన్ దీప్ రాజన్.. ప్రైజ్ మనీ ఎంతంటే?

ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేతగా పవన్ దీప్ రాజన్ నిలిచాడు. ఫైనల్ లో తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియతోపాటు అరుణిత కంజిలాల్‌, నిహల్‌, సేలీ కంబ్లే, మహ్మద్‌ దనిష్‌ ను వెనక్కు నెట్టి.. పవన్ టైటిల్ గెలుచుకున్నాడు.

ABP Desam Last Updated: 16 Aug 2021 01:04 AM
ఇండియన్ ఐడల్ విన్నర్ పవన్ దీప్ రాజన్

 





ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12 విజేతగా పవన్ దీప్

సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్‌ మ్యూజికల్‌ రియాలిటీ షో ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12 విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ నిలిచాడు. 25 లక్షల ప్రైజ్ మనీతోపాటు ట్రోఫిని పవన్ కు అందించారు. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్‌, మూడో స్థానంలో సేలీ కంబ్లే, నాలుగో స్థానంలో మహ్మద్‌ దనిష్‌, ఐదో స్థానంలో నిహల్‌, మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. 12 గంటల పాటు సాగిన ఈ ఫైనల్‌ పోటీ ఉత్కంఠ రేపింది.  మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఫైనల్‌ షో అర్ధరాత్రి వరకు జరిగింది.  మొదటినుంచి అద్భుత గానంతో అలరించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి.. ఫైనల్‌ బరిలో మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియతో సహా పవన్‌దీప్‌ రాజన్‌, అరుణిత కంజిలాల్‌, నిహల్‌, సేలీ కంబ్లే, మహ్మద్‌ దనిష్‌ నిలిచారు. ఈ ఫైనల్‌లో విజేతగా ఎవరు నిలుస్తారని అందరూ ఎంతో ఆసక్తితో చూశారు. చివరకు విజేతగా పవన్‌దీప్‌ నిలిచాడు.


 

ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన పవన్‌దీప్‌ రాజన్‌..

పవన్ దీప్ రాజన్ ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా నిలిచాడు. మిగతా ఐదుగురు ఫైనలిస్టులను ఓడించి.. టైటిల్ గెలుచుకున్నాడు.

స్టేజ్ పైకి ఆరుగురు ఫైనలిస్టులు



షో ఫైనల్ కు చేరింది.  ‘ఇండియన్ ఐడల్ 12’ లో ఆరుగురు ఫైనలిస్టులు వేదికపైకి వచ్చారు. ఆఖరి ఎపిసోడ్ కి ఉదిత్‌ నారాయణ్‌, అల్కా యజ్ఞిక్‌, సుఖ్వీందర్ సింగ్  అతిథులుగా వచ్చారు.




షణ్ముకకు విజయ దేవరకొండ సర్ ప్రైజ్

తెలుగు అమ్మాయి షణ్ముకకు హీరో విజయ్ దేవరకొండ వీడియో మెసెజ్ పంపాడు. అన్ని మరిచిపోయి.. షోను ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. పోటీలో ఉన్న వాళ్లకు, న్యాయ నిర్ణేతలకు శుభాకాంక్షలు తెలిపాడు. 'షణ్ముఖ ప్రియా మీరు తిరిగి హైదరాబాద్ వచ్చాక మనం కలుద్దాం. మీరు నా సినిమాలో పాడాలి. ఇదే మన డీల్ అని చెప్పాడు.

తెలుగు అమ్మయి షణ్ముఖ.. 'సరిగమప' విజేత

తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న షణ్ముఖ ‘స రి గ మ ప కిడ్స్‌’ (తెలుగు) విజేతగా నిలిచింది ఈ విశాఖపట్నం అమ్మాయి.  ‘ఇండియన్‌ ఐడల్‌ ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందించింది. ఇక్కడ పాడాలని నేనెప్పటి నుంచో కలలు కన్నాను. ఈ షో చూస్తూ పెరిగాను. ఎప్పటికైనా  అక్కడికి వెళ్లాలి అనుకునేదాన్ని. నేనే కాదు నా కుటుంబమూ ఇదే డ్రీమ్‌తో ఉండేది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అన్ని రకాల పాటల్ని పాడాను’ అని చెబుతోంది షణ్ముఖ. 


దనీష్.. ఇప్పటికే హిమేశ్ రేష్మియాతో ఛాన్స్ కొట్టేశాడు

 దాదాపు సంవత్సరం గడిచినా నిన్ననే ప్రారంభమైనట్టు ఉంది అని చెబుతున్నాడు మహ్మద్‌ దనీష్‌. ఇంతమంది ప్రేక్షకులు నాపై అభిమానం చూపించడం నమ్మలేకపోతున్నా అంటాడు.  కరోనా కారణంగా తొలిసారి ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌ జరిగాయని చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమ న్యాయనిర్ణేతల్లో ఒకరైన హిమేశ్‌ రేష్మియాతో కలిసి ఓ మ్యూజిక్‌ వీడియోని రూపొందించే అవకాశం అందుకున్నాడు దనీష్‌. ఇతనిది ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌.

సేలీ కంబ్లే.. చాలా కంగారు పడిందట

మహారాష్ట్ర అమ్మాయి సేలీ కంబ్లే.. తొలిసారి ఇండియన్‌ ఐడల్‌ వేదికపై ప్రదర్శన ఇచ్చేటప్పుడు చాలా కంగారు పడిందని చెబుతోంది. ఈ షో 'మా అందరిలో మార్పు తీసుకొచ్చింది. ఆడిషన్స్ చేసినప్పుడు నేను ఎంపిక అవుతానని ఊహించలేదు. ఇక్కడి వచ్చాక ఎంపిక చేసుకున్న ప్రతి పాటా నాదే అన్నట్టు భావించి, మనసు పెట్టి పాడాను’ అని అంటోంది సేలీ..

నిహల్.. చిన్నప్పటి నుంచే పాడేవాడు

మరో గాయకుడు నిహల్‌. ఇతడిది కర్ణాటకలోని మంగళూరు. చిన్నప్పటి నుంచే సంగీతం అంటే చాలా ఇష్టం. నాలుగేళ్లకే పాటలు పాడేసి, అందరినీ అలరించేవాడు. అలా సింగింగ్‌పై ఉన్న మక్కువ ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. ఇండియన్‌ ఐడల్‌ టాప్‌ సిక్స్‌ కంటెస్టెంట్ల జాబితాలో ఒకడిగా నిలుస్తానని ఎప్పుడూ అనుకోలేదని చెబుతాడు నిహల్.

అరుణిత కంజిలాల్.. ఇండియన్ ఐడల్ లో పాడటమే ఈమె కల

ప్రముఖ రియాలిటీ షో ‘స రి గ మ ప’ (బెంగాలీ) విజేతగా నిలిచింది.. అరుణిత కంజిలాల్. ఈమెది కోల్‌కతా. ఇండియన్‌ ఐడల్‌ వేదికపై పాడటమే ఈ పద్దెనిమిదేళ్ల గాయని కల. లక్ష్యం చేరుకుంది. గెలుపోటములు పక్కనపెడితే ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొట్టింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఇండియన్‌ ఐడల్‌ కార్యక్రమంలో పాల్గొనాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఈ సీజన్‌లో చాలా గట్టి పోటీ ఉంది. గెలిచేందుకు నా వంతు నేను కృషి చేస్తున్నా’ అని చెబుతుంది అరుణిత.

పవన్ దీప్ రాజన్ కు.. ఫోక్ సంగీతమంటే ఇష్టం

ఉత్తరాఖండ్ కు చెందిన పవన్ దీప్ రాజన్ కు ఫోక్ సంగీతమంటే ఇష్టం.  ఇలాంటి షోలో తనకి అవకాశం రావడం నమ్మలేకపోతున్నాని చెబుతాడు. ‘స్నేహితులు, కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటున్నాననే బాధ తొలినాళ్లలో ఉండేది. తర్వాతర్వాత ఆ ఆలోచన పోయింది. ఇప్పుడేమో ఈ షో ముగుస్తుందంటేనే అదోలా ఉంది.' అని అంటున్నాడు.

Background

దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని అలరించే కార్యక్రమం ‘ఇండియన్‌ ఐడల్‌’. 11 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ మ్యూజికల్‌ షో ప్రస్తుతం 12వ సీజన్‌ ఫైనల్ కు వచ్చింది. టైటిల్‌ పోరులో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియతో సహా పవన్‌దీప్‌ రాజన్‌, అరుణిత కంజిలాల్‌, నిహల్‌, సేలీ కంబ్లే, మహ్మద్‌ దనిష్‌ ఉన్నారు.


ఆదిత్య నారాయణ్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా హిమేశ్‌ రేష్మియా, అను మాలిక్‌, సోను కక్కర్‌ న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. రసవత్తరంగా సాగే ఆఖరి ఎపిసోడ్‌కి సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ, ఉదిత్‌ నారాయణ్‌, అల్కా యజ్ఞిక్‌ అతిథులుగా వచ్చారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.