హైపర్ ఆది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. అద్భుతమైన పంచులతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జబర్దస్త్’ టీమ్ లీడర్ గా మారిపోయారు. బుల్లితెర ప్రేక్షకులను కడుబపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. తాజాగా ‘రూల్స్ రంజన్’ సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన, తెలుగు సినిమా పరిశ్రమ గురించి చులకనగా మాట్లాడేవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇకనైనా ఆ విమర్శలు మానుకోండి- హైపర్ ఆది


“తెలుగు సినిమా స్థాయిని రోజు రోజుకూ పెంచుకుంటూ వెళ్తున్న దర్శకులు, హీరోలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ అభినందనలు చెప్తున్నాను. ఇప్పటికీ మన సినిమా రంగాన్ని గురించి చులకనగా మాట్లాడే వారికి ఓ విషయం చెప్తున్నా. తెలుగు సినిమా పురోగతిని చూసైనా అలాంటి మాటలు మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.   మా అబ్బాయి చదువు, సంధ్యా లేకుండా గాలికి తిరుగుతున్నాడు. కొంచెం సినిమాల్లోకి తీసుకెళ్లండని చెప్పేవాళ్లు, ఒక ఆడపిల్ల సినిమాల్లోకి వస్తానంటే చెడబుట్టావు కదే అని తిట్టేవాళ్లు, ఎక్కడైనా అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు సినిమాలు చూసి చెడిపోయారు అనే వాళ్లలాంటోళ్లే సినిమా పరిశ్రమ గురించి చులకనగా మాట్లాడుతారు. వీరంతా ఇప్పటికైనా ఆ మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది” అని చెప్పుకొచ్చారు.  


సినిమా అనేది ఎప్పుడూ మంచే నేర్పింది- హైపర్ ఆది


“సినిమా అనేది ఎప్పుడూ మంచే నేర్పింది. చెడు ఎప్పటికీ నేర్పించదు. సినిమాల్లో చూపించే చెడును కాదు, మంచిని మాత్రమే స్వీకరించాలి. పల్లెటూరు నుంచి నగరానికి వచ్చి ఆయన్నే దేవుడిగా కొలిచే స్థాయికి ఎదగిన పెద్ద ఎన్టీఆర్‌ను చూసి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నేర్చుకోండి. విజయం ఎంత ముఖ్యమో, వినయం అంతే ముఖ్యమని 90 ఏళ్ల జీవితం, 75 ఏళ్ల నటన జీవితం ఉన్న ఏయన్నార్‌ను చూసి నేర్చుకోండి. అల్లూరి సీతారామరాజు లాంటి చిత్రాలు తీసి ఈ రోజుల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచిన,  నిర్మాతకు నష్టం వస్తే డబ్బులు తిరిగిచ్చే మంచి మనసున్న కృష్ణగారిని, ఇంటికి వచ్చింది శత్రువు అయినా అన్నం పెట్టి మాట్లాడాలనే సంస్కారం ఉన్న కృష్ణం రాజుగారి నుంచి ఎంతో నేర్చుకోవాలి. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకుని చూపించి, ఎవరికైనా పెట్టే స్థితిలో ఉండాలి కానీ నెట్టే స్థితిలో ఉండకూడదని చెప్పి బతికినంతకాలం రాజులా బతికిన శోభన్‌బాబుగారి నుంచి నేర్చుకోవాలి. తెలుగు సినిమాలో ఏదైనా పాత్ర దక్కితే చాలనుకుని తెలుగు సినిమానే శాసించే స్థాయికి చేరిన మెగాస్టార్‌ చిరంజీవి చూసి నేర్చుకోండి. ఆయన తల్లికి క్యాన్సర్‌ వచ్చి మరణిస్తే అలాంటి స్థితి ఏ తల్లికి రాకూడదని బసవతారకం ఆస్పత్రిని పెట్టిన బాలకృష్ణగారిని చూసి బాగా బతకడం అంటే మనం మాత్రమే కాదు.. పక్కన వాళ్లను కూడా బతికించాలని నేర్చుకోవాలి. 6 పదుల వయసులో కూడా ఆరోగ్యం ఉంటే అన్ని బావుంటాయని నమ్ముతూ నవ మన్మధుడిలా కనిపించే నాగార్జును, నాన్న గొప్పొడు నేను కాదు అని గ్రహించి ముందుకెళ్లే విక్టరీ వెంకటేశ్‌, తనకు జీవితం ఇచ్చిన గురువు దాసరి నారాయణరావు దైవంగా భావించే మోహన్‌బాబుగారిని చూసి గురు భక్తిని నేర్చుకోండి. ఎంతోమంది చిన్నారుల గుండెల్ని కాపాడుతున్న మహేశ్‌బాబుని చూసి చాలా నేర్చుకోవచ్చు. పేదల  ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే అని భావించి పవన్‌కల్యాన్‌ని చూసి నేర్చుకోండి సంపాదించడమే కాదు.. సహాయం చేయడం కూడా ముఖ్యమని. ప్రభాస్‌, రామ్‌చరణ్‌, బన్నీ, రానా, గోపీచంద్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, రామ్‌, ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు”అని అన్నారు.



Read Also: మ‌న‌సుకు హ‌త్తుకుంటున్న సిద్ధార్థ్ ఎమోషన్ థ్రిల్లర్- `చిన్నా` ట్రైల‌ర్ విడుద‌ల



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial