Prasad Multiplex: టాలీవుడ్ లో ప్రతీవారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సినిమాల రిలీజ్ రోజు ధియేటర్ల వద్వ రివ్యూల కోసం పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ రెడీ ఉంటాయి. మొదటి ఆట ముగిసి ప్రేక్షకులు బయటకు రావడం ఆలస్యం సినిమా ఎలా ఉంది అంటూ ప్రేక్షకుల అభిప్రాయాన్ని తెలుసుకొని వాటిని క్షణాల వ్యవధిలో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా థియేటర్ల వద్ద ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఈ మధ్య ఈ యూట్యూబ్ రివ్వూల తీరు దారుణంగా తయారైంది. ఇలా థియేటర్ వద్దే రివ్యూలు ఇవ్వడంతో మిగతా ప్రేక్షకులకు ఇబ్బందికరంగా ఉండటమే కాకుండా హీరోల అభిమానుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. పెద్ద హీరోల సినిమాల రోజు పరిస్థితి వర్ణణాతీతం. అందుకే ఇలాంటి వాటిన నియంత్రించడానికి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ కీలక నిర్ణయం తీసుకుంది.


మల్టీప్లెక్స్ ఆవరణలో నో రివ్యూలు..


కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటారు మేకర్స్. ఒక్క సినిమా మీద వందల మంది టెక్నీషియన్లు, కార్మికులు జీవితాలు ఆధారపడి ఉంటాయి. అయితే రిలీజ్ అయిన వాటిలో కొన్ని సినిమాలు ఆడతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. కొన్ని సినిమాలు మొదట్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత పుంజుకుంటాయి. అయితే విడుదల అయిన రోజే ఇలా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంతో సినిమా కలెక్షన్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే అలాంటి రివ్యూలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ప్రసాద్ మల్టీప్లెక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ మల్టీప్లెక్స్ వద్ద ఎలాంటి రివ్యూలు తీసుకోవడానికి వీల్లేకుండా ఓ సర్క్యులర్ ను జారీ చేసింది. దీంతో రివ్యూలు ఇచ్చే యూట్యూబ్ ఛానళ్లకు షాక్ తగిలినట్లైంది. ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే అయినా చాలా మంది యూట్యూబ్ ఛానళ్ల వారికి మాత్రం ఇబ్బందే. అయితే, ఈ నిర్ణయంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేశారు. కొందరైతే పండుగ చేసుకుంటున్నారు. ఇక రోత రివ్యూలు ఉండవని సంబరపడుతున్నారు.


‘ఆదిపురుష్’ రోజు జరిగిన గొడవే కారణమా?


టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్నపుడు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లు రివ్వూల కోసం వాలిపోతుంటాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ రోజు కూడా చాలా యూట్యూబ్ ఛానళ్లు ప్రేక్షకుల నుంచి రివ్యూలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువకుడు యూట్యూబ్ ఛానల్ తో ‘ఆదిపురుష్’ మూవీ గురించి నెగిటివ్ గా చెప్పడంతో అక్కడున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆ యువకుడిని చితకబాదారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకే ఇలాంటి గొడవలు జరగకూడదు అనే ఉద్దేశంతోనే ప్రసాద్ మల్టీప్లెక్స్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏదేమైనా ఇలాంటి రివ్యూలు ఇచ్చే చానళ్లపై నిషేదం విధించడం మంచిందే అంటున్నారు కొంతమంది నెటిజన్స్. మరి ప్రసాద్ మల్టీప్లెక్స్ వాళ్లు చేసినట్టు మిగతా థియేటర్లు కూడా మున్ముందు ఇలాంటి నిషేద చర్యలు చేపడతారేమో చూడాలి.


Also Read: ఆ విషయంలో ‘కార్తీకేయ-2’ను మించిపోయిన ‘స్పై’ - నిఖిల్ కెరీర్లోనే బెస్ట్!