Bandla Ganesh On Producers Guild : సినిమా టికెట్ ధరలు ఒకసారి పెంచాలని, తగ్గించాలని ప్రభుత్వాల వెంటబడడం వల్లే ప్రేక్షకులకు థియేటర్ కు వచ్చే ఆసక్తి తగ్గిపోయిందని అగ్ర నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమపై నిర్మాత అశ్వినీదత్ వ్యాఖ్యలపై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. అశ్వనీదత్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.  ఏ హీరోని, ఏ డైరెక్టర్‌ను రెమ్యునరేషన్ తగ్గించుకోమనే అర్హత ఏ నిర్మాతకు లేదన్నారు. కాల్ షీట్లకి, షీట్లకు తేడా తెలియని నిర్మాతలు సినిమాలు తీస్తున్నారని ఆరోపించారు. షూటింగ్ ఎప్పుడు ప్యాకప్ అవుతుందో తెలియని వాళ్లు కూడా సినిమాలు తీస్తున్నారన్నారు. తాను నటుడిగా, మేనేజర్‌గా, నిర్మాతగా ఇండస్ట్రీలో ఉన్నా సినిమాను ప్రేమించి తీయాలని భావిస్తానన్నారు. కొత్తగా ఏర్పడిన నిర్మాతల గిల్డ్ ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసే అని బండ్ల గణేష్ తేల్చేశారు.  అశ్వినీదత్ మాట్లాడింది 100 శాతం కరెక్టేనని ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కల్యాణ్ అన్నారు. అశ్వినీదత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. సీనియర్ నిర్మాతలతో ఓ కమిటీ వేసి ఈ సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని కోరారు. 


సినీ పరిశ్రమపై అశ్వినిదత్ సంచలన వ్యాఖ్యలు 


సినీ నిర్మాత అశ్వినీదత్ సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలపై ప్రేక్షకులకు విరక్తి కలిగిందన్నారు. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడమే పెద్ద సవాల్ గా మారిందన్నారు. ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లి టికెట్‌ ధరలు పెంచుకోవడమే ఇందుకు కారణమన్నారు. సీతారామం సినిమా విడుదల సందర్భంగా గురువారం అశ్వినీదత్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీరుపైనా అశ్వినీదత్ మండిపడ్డారు.  నిర్మాతల శ్రేయస్సు కోసం నిర్మాతల కౌన్సిల్‌ ఏర్పాటైందన్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియట్లేదన్నారు. 


నిర్మాతల్లో స్థిరత్వం లేదు 


సినిమా టికెట్ ధరలు తగ్గించాలని, పెంచాలని చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని అశ్వినీదత్ అన్నారు. టికెట్‌ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు షూటింగ్స్‌ బంద్‌ అని ఆందోళన చేస్తు్న్నారని ఆరోపించారు.  సీఎంలతో మాట్లాడి టికెట్ల ధరలు పెంచుకున్నారని, దీంతో కొంత మంది ప్రజలు థియేటర్‌కు రావడం లేదన్నారు. టికెట్ రేట్లు, థియేటర్ లో క్యాంటీన్ల రేట్లు చూసి కుటుంబంతో సినిమాకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదన్నారు. ఇప్పుడు ఓటీటీలు వచ్చాయని, వాటిపై విమర్శలు చేస్తున్నారని, థియేటర్‌కు జనం రాకుండా ఓటీటీల్లో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టమన్నారు.  మార్కెట్ ధరకు తగిన విధంగా హీరోలకు రెమ్యునిరేషన్ ఇస్తున్నామని, అంతే కానీ ఇష్టారీతిన హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదన్నారు. హీరోల రెమ్యునిరేషన్ వల్లే టికెట్‌ ధరలు పెంచారనేది అవాస్తవమన్నారు. ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదని అశ్వినీదత్ సంచలన ఆరోపణలు చేశారు.