ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించినప్పుడు నిర్మాతలు ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలిసిందే. అక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేట్లు ప్రేక్షకులకే అన్యాయంగా అనిపించాయి. దాదాపు ఏడాది పాటు నిర్మాతలను కష్టపెట్టిన ప్రభుత్వం ఫైనల్ గా టికెట్ రేట్లు సవరించింది. సాధారణ రేట్లు అయితే ఇండస్ట్రీ జనాలు కోరుకునే స్థాయిలో లేవు. అయినప్పటికీ.. ఈ రేట్లు సంతృప్తికరంగానే ఉన్నాయంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీకి ఫేవర్ గా నిర్ణయాలు తీసుకుంటుంది.
ఇప్పటికే సాధారణ స్థాయిలో పెంచిన రేట్లు ప్రేక్షకులకు భారంగా మారాయి. సింగిల్ స్క్రీన్ లలో రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.200గా మారింది కనీస ధర. అది సరిపోదన్నట్లుగా పెద్ద సినిమాలను రెండు వారాలు అదనంగా రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. దీంతో సింగిల్ స్క్రీన్లో రూ.200, మల్టీప్లెక్స్ లలో రూ.250కి కనీస ధర పెరిగిపోయింది. హ్యాండ్లింగ్ ఛార్జీలు కూడా కలిపితే రేటు రూ.330 వరకు అవుతుంది.
ఒక్కో టికెట్ కి ఇంత ఖర్చు పెట్టి ఫ్యామిలీని తీసుకొని థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటె మధ్య తరగతి జనాలకు ఎంత భారమనేది ఎవరూ ఆలోచించడం లేదు. ఈ రేటే ఎక్కువ అనుకుంటే.. 'ఆర్ఆర్ఆర్' సినిమాకి దీని మీద అదనంగా రేట్లు పెంచేస్తున్నారు. దీని ప్రకారం ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి సింగిల్ స్క్రీన్ లలోనే రేటు రూ.250 అవుతుంది. మల్టీప్లెక్సుల ధర రూ.350కి చేరుకుంది. కొన్ని ఏరియాల్లో ఒక్క టికెట్ ధర రూ. 413 గా ఉంది. జీఎస్టీ, ఇతర చార్జీలు కలిపితే మొత్తంగా ఒక్క టికెట్‌కు రూ. 451.76 చెల్లించాల్సి ఉంటుంది.
సౌత్ లో ఇప్పుడు తెలంగాణలోనే అత్యధిక టికెట్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే.. ఇక సినిమా విడుదలైన తరువాత డిమాండ్ ను బట్టి మరింతగా రేట్లు పెంచేయడం ఖాయం. ఇప్పటికే కరోనా, ఓటీటీల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమయ్యారు. రిపీట్ ఆడియన్స్ కూడా బాగా తగ్గిపోయారు. ఇలాంటి సమయంలో ఇంతగా రేట్లు పెంచేస్తే మరి కలెక్షన్స్ వస్తాయో లేదో చూడాలి!