పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. 


ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. నిజానికి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అలా జరగలేదు. రీసెంట్ గా చిత్రబృందం రెండు రిలీజ్ డేట్స్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 25 లేదా.. ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పాండమిక్ పరిస్థితులు అనుకూలించేదానిపై రిలీజ్ ఆధారపడి ఉంటుందని చెప్పారు. 


అందుతున్న సమాచారం ప్రకారం.. నిర్మాత నాగవంశీ ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేస్తామని బయ్యర్లకు చెప్పారట. ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గించిన కారణంగా.. రూ.40 కోట్ల రేంజ్ లో అక్కడ సినిమాను అమ్మాలని చూస్తున్నారు. టికెట్ రేట్స్ లేకపోయినా.. ఫుల్ ఆక్యుపెన్సీ, సెకండ్ షో ఉంటే చాలని బయ్యర్లు వెంటపడడం మొదలుపెట్టారు. నిజానికి ఈ సినిమాకి రెగ్యులర్ బయ్యర్లు ఉన్నారు.


వారిని కాదని సినిమాను వేరే వారికి ఇవ్వలేరు. అయినప్పటికీ ఇతర బయ్యర్లు ఈ సినిమాను దక్కించుకోవడానికి భారీ ఆఫర్లు ఇస్తున్నారట. నైజాంలో సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను అమ్మలేదట. తొందరపడి శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మేసి ఇబ్బందిపడే ఆలోచన చేయడం లేదు నిర్మాతలు. ఇప్పుడు 'భీమ్లానాయక్'కి వస్తున్న డిమాండ్, హడావిడి చూస్తుంటే నాన్ థియేటర్ హక్కులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.