Allu Arjun's Birthday Wish to Megastar :  మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.  మన ఏకైక మెగా స్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు

గత కొన్నాళ్లుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. చిరంజీవి - అల్లు అర్జున్, మెగా ఫ్యాన్స్ మధ్య వివాదం గురించి సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తిపోయాయ్. అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య మొదలైన వార్ ఓ దశలో తీవ్రమైంది. ఐదేళ్ల క్రితం నుంచి ఈ గొడవ పెరుగుతూ వచ్చింది. 2020లో అల్లు అర్జున్ తన 17 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా గంగోత్రి సినిమాను గుర్తుచేసుకుంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టారు. అందులో గంగోత్రి సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్‌లకు ధన్యవాదాలు చెప్పారు కానీ ఇందులో ఎక్కడా చిరంజీవి ప్రస్తావన లేదు. ఇక్కడనుంచి మొదలైంది ట్రోలింగ్..అలా పెరిగి పెరిగి మెగాఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లా మారింది

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో YCP అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలిపారు. ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి వెళ్లి కలిశాను అన్నది అల్లు అర్జున్ వెర్షన్. కానీ ఈ విషయంపై మెగాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగబాబు, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్‌పై కామెంట్స్ చేశారు. అడవులు నరికివేత గురించి పవన్ చేసిన కామెంట్స్ పుష్పలో బన్నీని ఉద్దేశించినవే అనే ట్రోలింగ్ నడిచింది

పుష్ప-2 రిలీజ్ టైమ్ లో సంధ్య థియేటర్లో జరిగిన దుర్ఘటన ఇండస్ట్రీలో, రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, చిన్నారి తీవ్రంగా గాయపడడంతో బన్నీ ఇంటివద్ద ఆందోళనలు జరిగాయ్. ఈ సమయంలోనూ మెగాభిమానులు కొందరు బన్నీని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారన్నది అల్లు అర్జున్ అభిమానుల అసంతృప్తి. కొంతమంది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని ఆ కుటుంబం నుంచి వేరు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఓ సమావేశం కోసం పెట్టిన ఫ్లెక్సీలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫోటోలున్నాయి కానీ బన్నీ ఫొటో ముద్రించలేదు. సేమ్ టైమ్..సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు చిరంజీవిపై ట్రోల్స్ చేయడం మెగాఫ్యాన్స్ కి కోపం తెప్పించిందనే డిస్కషనూ జరిగింది

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే...

ఇప్పటివరకూ అల్లు అర్జున్ తన మావయ్యపై గౌరవాన్ని తెలియజేస్తూనే వచ్చారు. ఏ ఇంటర్యూలో చిరంజీవి ప్రస్తావన వచ్చినా గొప్పగానే మాట్లాడారు.

చిరంజీవి కూడా ఎప్పుడూ హుందాగానే వ్యవహరించారు. తమ కళ్ల ముందు పుట్టిన బిడ్డలు తమను దాటి ఎదగడం ఎంతో సంతోషం..అంతకన్నా ఏం కావాలి చెప్పండి అంటూ బన్నీ విజయంపై రియాక్టయ్యారు.

కుటుంబాల మధ్య వివాదాలు సహజం..వాటికి ఎన్నో కారణాలు ఉండొచ్చు..అవన్నీ పూర్తిగా వారి వ్యక్తిగతం. ఇక్కడ మెగా- అల్లు కుటుంబాల మధ్య వివాదం ఉందా సామరస్యం ఉందా అన్నది పక్కనపెట్టేస్తే.. ఇరు వర్గాల అభిమానుల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఇప్పటికీ పూర్తిస్థాయిలో లేదని చెప్పొచ్చు.

2025 ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పటికైనా అభిమానుల మధ్య వివాదం సమసిపోతుందేమో వెయిట్ అండ్ సీ...