మాస్ మహారాజ రవితేజ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో కొనసాగుతోంది. ‘క్రాక్’తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజ, ‘ధమాకా’తో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా నటించి ఆకట్టుకున్నారు. ఈ మూవీ సైతం వంద కోట్లు రాబట్టింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ ఇవాళ(జనవరి 26న) 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..


టాలీవుడ్ బాక్సాఫీస్ కు ‘క్రాక్’ పట్టిస్తున్న రవితేజ


రవితేజ నటన ప్రేక్షకులకు మస్త్ ‘కిక్’ ఇస్తుంది. ‘ఖతర్నాక్’ ఫైట్స్ తో విలన్స్ ‘బలుపు’ తగ్గిస్తాడు. నటనలో ‘బెంగాల్ టైగర్’లా విజృంభిస్తారు. ఆయన కామెడీ టైమింగ్ ముందు మిగతా హీరోలు ‘బలాదూర్’ కావాల్సిందే. ‘ఇడియట్’లా అల్లరి చేసినా, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’లా ఆకట్టుకున్నా ఆయనకే చెల్లింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ ‘క్రాక్’పడుతోంది. వరుస హిట్లతో దుమ్మరేపుతున్నారు.


అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగిన మాస్ మహారాజ


రవితేజ 1968 జనవరి 26 తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు. జననం తల్లిదండ్రులు రాజ్ గోపాల్ రాజు, రాజ్య లక్ష్మీ భూపతి రాజు. రవితేజ పూర్తి పేరు రవి శంకర్ రాజు భూపతి రాజు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా రవితేజ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. స్వయంకృషితో పైకెదిగారు. నటుడిగా అవకాశం రాక ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. తొలిసారి ‘కర్తవ్యం’ అనే సినిమాతో తెరపై కనిపించారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ప్రాధాన్యత లేని పాత్రలు చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘నీ కోసం’ సినిమాలో సోలో హీరోగా చేశారు. అక్కడితో తన కెరీర్ మరో మలుపు తిరిగింది.


అగ్రహీరోలతో సినిమాలు


మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘అన్నయ్య’ సినిమాలో నటించారు రవితేజ. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’లో నటించి మరోసారి తిరుగులేదని నిరూపించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అటు నాగార్జునతోనూ కలిసి నటించారు.  హీరోగా రవితేజకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ‘ఇడియట్’. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా రవితేజ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ య్యింది.  కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖడ్గం’ సైతం అద్భుత విజయాన్ని అందుకుంది. గోపిచంద్ మలినేనితో సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ సాధించారు. ‘బలుపు’ ‘డాన్ శీను’, ‘క్రాక్’ మూవీతో వరుస హిట్లు అందుకున్నారు.  రవితేజ కెరీర్‌లో ‘కిక్’ మూవీ మంచి బూస్టింగ్ ఇచ్చింది. ‘విక్రమార్కుడు’ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ సాధించారు. ‘ఓ పనైపోతుంది బాబు’‘విక్రమార్కుడు’, ‘కిక్ 2’, ‘డిస్కోరాజా’ సినిమాల్లో ఆయన డ్యుయెల్ రోల్ చేసిన ఆకట్టుకున్నారు. ‘డిస్కోరాజా’ ‘ఖిలాడి’తో ఫర్వాలేదు అనిపించారు. రీసెంట్‌గా ‘ధమాకా’ సినిమాతో మంచి సక్సెస్‌ అందుకున్నారు రవితేజ.


పలు అవార్డులు ఆయన సొంతం


రవితేజ తన నటనకు గాను పలు అవార్డులు అందుకున్నారు. ‘నీ కోసం’, ‘ఖడ్గం’ సినిమాల్లోని నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును తీసుకున్నారు. ‘నేనింతే’ మూవీకి గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు పొందారు. ప్రస్తుతం రవితేజ ‘రావణాసుర’ సినిమాలో నటిస్తున్నాడు. యూనిక్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సమ్మర్ లో ఏప్రిల్ 7న విడుదల కానుంది.






Read Also: ఓ మై గాడ్ - ‘వాల్తేరు వీరయ్య’ కోసం చిరంజీవి, రవితేజ అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా?