తెలుగు సినీ అభిమానులకు బ్రహ్మానందం గురించి పరిచయం అవసరం లేదు. పండు ముసలి నుంచి చిన్న పిలల్ల దాకా, ఆయన పేరు వింటేనే పెదవులపై నవ్వుల పువ్వులు పూస్తాయి. వెండి తెరపై ఆయన కనిపిస్తే చాలు నవ్వుల్లో మునిగిపోతారు. 3 దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ కింగ్ గా కొనసాగుతున్నారు. తెలుగు హాస్య నటుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. ఇవాళ ఆయన 67వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.


చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి


బ్రహ్మానందం అసలు పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ఫిబ్రవరి 1, 1956లో గుంటూరు జిల్లా,  ముప్పాళ్లలో జన్మించారు.  తండ్రి నాగలింగాచారి, తల్లి లక్ష్మీనరసమ్మ. బ్రహ్మానందం తండ్రి రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు ఉండేది. తండ్రితో పాటు ఆయన కూడా అప్పుడప్పుడు నాటకాలు వేసేవారు. కానీ, చదువును నిర్లక్ష్యం చేయలేదు.  చక్కగా చదువుకుని లెక్చర్ ఉద్యోగాన్ని పొందారు. నటన పట్ల తనకు ఎప్పుడూ ఆసక్తి తగ్గిపోలేదు. వేజళ్ల సత్యనారాయణ తెరకెక్కించిన ‘శ్రీతాతావతారం’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇందులో నరేష్ హీరోగా నటించగా, ఆయనకున్న నలుగురు మిత్రుల్లో బ్రహ్మానందం ఒకరుగా చేశారు. తొలుత నటించింది ‘శ్రీతాతావతారం’ అయినా, ముందుగా విడుదలైన సినిమా ‘ఆహా నా పెళ్లంట’. ఈ సినిమాలో అరగుండు పాత్రలో నటించి అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు.


కెరీర్ ను మలుపు తిప్పిన ‘అహ నా పెళ్లంట’      


దిగ్గజ తెలుగు దర్శకుడు జంధ్యాల 1987లో తెరకెక్కించిన ‘అహ నా పెళ్లంట’ సినిమాతో బ్రహ్మానందం కనీవినీ ఎరుగని రీతిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో బ్రహ్మానందం సినీ ప్రవేశానికి గట్టి పునాదులు పడ్డాయి. ఆ తర్వాత ఆయన నటించిన అన్ని సినిమాల్లో కామెడీ పటాసుళ్లా పేలింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘డబ్బు’, ‘జంబ లకిడి పంబ’, ‘యమలీల’, ‘అల్లుడా మజాకా’, ‘బావగారు బాగున్నారా?’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మధుడు’, ‘సింహాద్రి’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘పోకిరి’, ‘ఢీ’, ‘కృష్ణ’, ‘జల్సా’, ‘రెడీ’, ‘కిక్’, ‘అదుర్స్’, ‘దూకుడు’, ‘జులాయి’, ‘బలుపు’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాల్లో అద్భుతంగా కామెడీ పండించారు. తనకు ఇచ్చిన ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు బ్రహ్మానందం. ఆయన నటించడం వల్లే మంచి విజయాలు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలకగమానదు. అద్భుతన నటనతో 1,200కు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు.


కామెడీ బ్రహ్మకు ఎన్నో అవార్డులు


బ్రహ్మానందం తన కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. తన అద్భుత నటనతో 6 నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్, 3 సైమా అవార్డులను పొందారు. ‘అహ నా పెళ్లంట’ సినిమాలో నటనకు గాను తొలి నంది అవార్డును అందుకున్నారు.  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును అందుకున్నారు. 2009లో కేంద్ర ప్రభుత్వం బ్రహ్మానందంకు పద్మశ్రీ పురస్కారం అందజేసింది.  


ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాలు చేయడం తగ్గించారు. కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ నవ్వుల రేడుకు సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.






Read Also: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి