Prasanth Varma About Teja Sajja: తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగిస్తోంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. సంక్రాంతి సినిమాల్లో ‘గుంటూరు కారం’ త‌ర్వాత వంద కోట్లు సాధించిన సెకెండ్ మూవీగా ‘హనుమాన్’ సత్తా చాటింది.

  


‘హనుమాన్’ కోసం థియేటర్లకు పోటెత్తుతున్న ప్రేక్షకులు


సంక్రాంతి సందర్భంగా ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’ ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పెద్ద సినిమాల నడుమ ‘హనుమాన్’ బరిలోకి దిగడంతో, థియేటర్లు సరిగా దొరకలేదు. మల్టీఫ్లెక్సులు సైతం పెద్దగా షోలు వేయలేదు. కానీ, ఈ సినిమాకు వస్తున్న భారీ రెస్పాన్స్ తో సినిమా థియేటర్ల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతోంది. ఇక ఓ యువకుడికి ఆంజనేయుడి నుంచి సూపర్ పవర్స్ వస్తే వాటిని ఎలా ఉపయోగించాడు అనేది సినిమా కథ. చక్కటి కథ, దానికితోడు ప్రశాంత్ వర్మ కథ నడిపించిన విధానం, అదిరిపోయే గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. చిన్న పిల్లలు సైతం ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.


8 ఏళ్ల నుంచి తేజతో ప్రశాంత్ ఫ్రెండ్షిప్


‘హనుమాన్’ మంచి విజయం సాధించడంతో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తేజ సజ్జతో తనకున్నపరిచయం గురించి ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఇద్దరి మధ్య 8 ఏళ్ల కిందటే పరిచయం ఏర్పడినట్లు చెప్పారు. “చాలా మంది  తేజతో పరిచయం ‘జాంబిరెడ్డి’ సినిమా టైంలో ఏర్పడింది అనుకుంటారు. కానీ, మా మధ్య పరిచయం 8 ఏళ్ల క్రితమే ఏర్పడింది. ఓ సినిమా గురించి చర్చించాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి సినిమా చేయాలి అనుకున్నాం. చాలా సినిమాల గురించి చర్చించాం. కానీ, కుదరలేదు. కొన్ని సినిమాలు ఫైనల్ అయినా, చివరి నిమిషంలో ఆగిపోయాయి. ‘జాంబిరెడ్డి’తో ఇద్దరం కలిసి సినిమా చేశాం. ఇప్పుడు ‘హనుమాన్’ చేశాం. ‘హనుమాన్ 2’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తాం” అని చెప్పారు.    


వారికి పూరి, రాజమౌళి లాగే తేజకు ప్రశాంత్!


అటు రవితేజతో పూరి జగన్నాథ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళితో వరుసగా మూడు సినిమాలు చేసినట్టే, ప్రశాంత్ వర్మ తాను కలిసి మూడు సినిమాలు చేయబోతున్నట్లు తేజ సజ్జ తెలిపారు. వాళ్ల కెరీర్‌ను ఆ సినిమాలు ఎలా మలుపు తిప్పాయో, ప్రశాంత్ వర్మతో నా సినిమాలు కూడా అలాగే ఉండబోతున్నాయన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘హనుమాన్’ సినిమాలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.


Read Also: ఒకే డ్రెస్‌ రెండేళ్లు వేసుకున్న మెగాస్టార్, ‘అంజి’ మూవీ కోసం చిరంజీవిని కోడి రామకృష్ణ అంత కష్టపెట్టారా?