Hanuman Creating Records: 'హనుమాన్' తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎక్కడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతూనే ఉంది. రిలీజై రెండు వారాలు దాటినా ఇంకా కలెక్షన్ల సునామీ ఆగలేదు. ఈ సినిమా తొలి వారంతో పోల్చితే రెండో వారంలో కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇక రిపబ్లిక్‌డే సెలవు కావడంతో, ఆ రోజు సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక అదే జోరు వీకెండ్స్‌లో కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే హనుమాన్ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిపోయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
15వ రోజు కలెక్షన్ల సునామీ..
తొలిరోజు నుంచే 'హనుమాన్' హిట్ టాక్ అందుకుంది. చూసిన ప్రతి ఒక్కరు సూపర్ అంటూ కామెంట్లు. ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి గొప్పగా చెప్పారు. వెరసీ ఈ ఎలిమెంట్స్ అన్నీ సినిమాకి ప్రేక్షకులు క్యూ కట్టేలా చేశాయి. దీంతో సినిమా కలెక్షన్ల సునామీ కొనసాగింది. ఇక 15వరోజు రిపబ్లిక్‌డే కావడంతో ఆ ఒక్కరోజే దాదాపు 10 కోట్ల వరకు వసూలు అయ్యింది. 14వ రోజు కలెక్షన్లు రూ.4.95 కోట్లు ఉండగా.. 13వ రోజు అది రూ.5.65 కోట్లు ఉంది. కలెక్షన్లలో తగ్గుముఖం కనిపిస్తుండగా.. రిపబ్లిక్‌డే రోజు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఇండియా, ఓవర్‌సీస్ కలెక్షన్ మొత్తంగా కలిసి రూ.250 కోట్ల వసూలు అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఇక అక్యూపెన్సీ విషయానికి వస్తే శుక్రవారం ఒక్కరోజే తెలుగులో 67.39 పర్సంటేజ్ కాగా.. హిందీలో 39.1 శాతంగా ఉంది. రిపబ్లిక్‌డే రోజు కావడంతో చాలామంది జనం సినిమా చూసేందుకు వచ్చారని, సినిమాలో ఉన్న భక్తి, ఎమోషన్స్, లవ్‌ట్రాక్ అన్ని ప్రేక్షకులను థియేటర్‌కి వచ్చేలా చేస్తున్నాయని సినిమా క్రిటిక్స్ చెప్తున్నారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు అనుకున్న సంఖ్యలో థియేటర్లు లభించలేదు. తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ పరిమిత స్క్రీన్లలో విడుదల అయ్యింది. తెలుగులో 450, హిందీలో 1500, ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్లలో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకోవడంతో థియేటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు అంచనాలకు మించి సినిమా ముందుకు దూసుకుపోతోంది.
'హనుమాన్' సినిమాకి ఇంత గ్రేట్ సక్సెస్ అందించినందుకుగాను ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పేందుకు స్పెషల్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. గ్రాటిట్యూడ్ మీట్ ద్వారా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' తీస్తున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ప్రశాంత్ వర్మ. ఇక సీక్వెల్‌లో తేజ సజ్జ హీరో కాదని, హనుమాన్ హీరో అని చెప్పారు. మరి సకెండ్ పార్ట్‌లో హనుమాన్‌గా ఎవరు నటించబోతున్నారో అందరిలో ఉత్కంఠ నెలకొంది. లిమిటెడ్ బడ్జెట్‌లో భారీ విజువల్ ఫీస్ట్‌ని ప్రేక్షకుల ముందు ఉంచారు ప్రశాంత్ వర్మ. దీంతో ఇప్పుడు 'జై హనుమాన్' మీద ఇంతే భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. మరి ఇది ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరి.
Also Read: మా నాన్న అలా ఉంటే ‘లాల్ సలామ్’ చేసేవారే కాదు - కూతురి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్