బాల నటిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన హన్సిక మోత్వాని, ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు, తమిళ సినీ పరిశ్రమలోనూ వరుస అవకాశాలు దక్కించుకుంది. వెండి తెరపై అవకాశాలు తగ్గడంతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టింది. పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. గత డిసెంబర్ లో తన చిన్ననాటి స్నేహితుడైన సోహెల్ కతురియాను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. జైపూర్ వేదికగా ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి వేడుక ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా తన తొలి ప్రేమ, బ్రేకప్, పెళ్లి గురించి హన్సిక కీలక విషయాలు వెల్లడించింది.


ఫస్ట్ బ్రేకప్ పై హన్సిక ఆసక్తికర వ్యాఖ్యలు


గతంలో  తమిళ హీరో శింబుతో కలిసి ప్రేమయాణం నడిపింది హన్సిక. అతడితో సహజీవనం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో తెలియదు కానీ, కొద్ది కాలం తర్వాత వీరిద్దరు విడిపోయారు. తాజాగా ఈ ప్రేమ వ్యవహారం గురించి హన్సిక తాజాగా స్పందించింది. “శింబుతో బ్రేకప్ తర్వాత మరొకరిని ప్రేమించడానికి చాలా సమయం పట్టింది. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. నేను రొమాంటిక్ పర్సన్‌ని. కానీ, భావోద్వేగాలను బయటకి వెల్లడించలేను. నాకు పెళ్లి మీద చాలా నమ్మకముంది. నిజం చెప్పాలంటే నేను మరొకరిని ప్రేమించడానికి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టింది. సోహైల్ నా జీవితంలోకి వచ్చాక ప్రేమ మీద నాకు మరింత నమ్మకం ఏర్పడింది. నా గత రిలేషన్‌ షిప్ ముగిసిపోయింది.  ప్రస్తుతం నేను కొత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. దేవుడు మాకు కొత్త దారి చూపించాడు’’ అని  హన్సిక వెల్లడించింది.  


హన్సికతో బ్రేకప్ పై శింబు ఏమన్నారంటే?


హన్సికతో ప్రేమ, బ్రేకప్ గురించి శింబు కూడా కొద్ది రోజుల క్రితమే స్పందించారు. తన లవ్ బ్రేకప్ ల వెనుక కారణాలు అనేకం ఉన్నా, ప్రేమ వ్యవహారాల్లో తనకు సరైన అవగాహన లేకపోవడం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం ప్రధానక కారణాలు అన్నారు. నయనతార, హన్సిక మోత్వాని ప్రేమ విషయంలో తాను అనేక పొరపాట్లు చేశానని చెప్పారు. అందుకే వారితో ముందుకు కొనసాగలేకపోయాను అన్నారు.  నయనతారతో ప్రేమయాణం కొనసాగించిన శింబు, ఆమెతో బ్రేకప్ అయ్యాక హన్సికతో డేటింగ్ చేశారు. ఆమెతోనూ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. ప్రస్తుతం హన్సిక ‘ఎంవై3’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.






Read Also: తమిళ హీరో కార్తితో పరుశురామ్ సినిమా, టైటిల్ ఇదేనా?