మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఆగస్టు 11వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సినిమా నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘జీపీఎస్‌తో భోళాశంకర్’. ఈ కార్యక్రమం కింద హైదరాబాద్ సిటీలో 600 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహిస్తున్నారు.
జీపీఎస్ కనెక్షన్ ద్వారా ఈ ర్యాలీ నడుస్తుంది. అంటే ఈ ర్యాలీ జరిగినంత సేపు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా చూస్తే చిరంజీవి ఫొటో తరహాలో కనిపిస్తుందన్న మాట. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి ఈ ర్యాలీ ప్రారంభం అయింది. ఇప్పటి దాకా మెగాస్టార్ చిరంజీవితో పని చేసిన నటులు, టెక్నీషియన్లు తమ అనుభవాలను వీడియోల ద్వారా పంచుకోవాలని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కోరింది.
'భోళా శంకర్'లో చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా నటించారు. చిరంజీవి, తమన్నాల మీద తెరకెక్కించిన 'మిల్కీ బ్యూటీ...' పాటకు మంచి స్పందన వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో మహానటి కీర్తి సురేష్ కనిపించనున్నారు. కీర్తి సురేష్‌కు జంటగా సుశాంత్ నటిస్తున్నారు.
'భోళా శంకర్' ట్రైలర్ కూడా ఇటీవలే విడుదల అయింది. కోల్‌కతాలో చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఆ అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఎవరున్నారు? అనేది మిస్టరీగా మారింది. సాధారణంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి పోలీసులు దగ్గరకు వెళ్లడం ఆనవాయితీ. అదే పోలీసులు తమకు సమస్య వస్తే భోళా శంకర్ దగ్గరకు వెళతారు. మరి ఆ సమయంలో భోళా శంకర్ ఏం చేశాడు? అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిది క్యాబ్ డ్రైవర్ రోల్ అని ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇందులో తెలంగాణ యాస మాట్లాడుతూ చిరంజీవి సందడి చేయనున్నారు. 'ఎట్లా ఇచ్చినా?' అని చిరంజీవి అడిగితే... 'అన్నా! మస్త్ ఇచ్చినవ్ అన్నా' అని గెటప్ శ్రీను ఇచ్చిన రెస్పాన్స్ వింటుంటే అభిమానులకు 'శంకర్ దాదా ఎంబిబిఎస్' గుర్తుకు వచ్చింది.
'భోళా శంకర్'లో హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ ఎదురు చూసే సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. 'ఖుషి' సినిమాలో బాగా ఫేమస్ అయిన 'ఏ మే రాజహా... ఏ మేరీ దునియా' పాటకు చిరంజీవి స్టెప్స్ వేశారు. పవర్ స్టార్ మేనరిజం ఇమిటేట్ చేశారు. ఆ తర్వాత రష్మితో 'తమ్ముడి పాట మస్త్ ఉందిలే' అనడం హైలైట్‌గా నిలిచింది. అలాగే శ్రీముఖితో కలిసి 'ఖుషి'లో నడుము సీన్‌కు సంబంధించిన స్పూఫ్ కూడా చేశారట.
'భోళా శంకర్' సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలోని నాలుగు పాటలని విడుదల చేశారు. లేటెస్ట్‌గా విడుదల అయిన 'ది రేజ్ ఆఫ్ భోళా' మెగా ర్యాప్ యాంథమ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. 'ది రేజ్ ఆఫ్ భోళా'కు నవాబ్ గ్యాంగ్ ఫేమ్ ఫిరోజ్ ఇజ్రాయెల్‌తో కలిసి సినీ దర్శకుడు మెహర్ రమేష్ సాహిత్యం అందించారు. 'ది రేజ్ ఆఫ్ భోళా' పాటను 'నవాబ్ గ్యాంగ్' ఫేమ్స్ అసుర, ఫిరోజ్ ఇజ్రాయెల్ ఆలపించారు.