పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా దర్శకుడు సాగర్ చంద్ర రూపొందిస్తోన్న చిత్రం 'భీమ్లానాయక్'. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందించారు. ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఈరోజు హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకకు కేటీఆర్, తెలంగాణ సినిమాటోగ్రాఫిక్ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి రాజకీయ నాయకులకు గెస్ట్ లుగా ఆహ్వానించారు. ఈరోజు ఈవెంట్ ఎలా జరుగుతుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


ఇలాంటి సమయంలో 'భీమ్లానాయక్' (Bheemla Nayak) ప్రీరిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. అలానే పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రకటనను విడుదల చేశారు.


''ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది'' అంటూ రాసుకొచ్చారు. 


ఇక సినిమా విషయానికొస్తే.. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా 'భీమ్లానాయక్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ గా కనిపించనున్నారు.