Kiara Advani Becomes The Highest Paid Actress: త్వరలోనే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన కమిట్మెంట్స్ అన్నీ చక చకా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం కియారా మోస్ట్ అవైటింగ్ పాన్ వరల్డ్ మూవీ 'టాక్సిక్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్‌తో ఇండియన్ సినిమాలోనే హయ్యెస్ట్ పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరింది. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం కియారా ఈ మూవీ కోసం ఏకంగా రూ.15 కోట్లు రెమ్యూనరేషన్‌గా వసూలు చేస్తుంది.


'టాక్సిక్' కోసం భారీ రెమ్యూనరేషన్ 
లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. ఈ మూవీని కన్నడతో పాటు ఇంగ్లీష్‌లో కూడా ఒకేసారి చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో డారెల్ డిసిల్వా అనే హాలీవుడ్ నటుడితో పాటు అక్షయ్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే నయనతార, కియారా అద్వానీ ఫిమేల్ లీడ్స్‌గా కనిపించబోతున్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే కియారా అద్వానీ తల్లి కాబోతున్న శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటికే ఒప్పుకొన్న సినిమా పనులను శరవేగంగా పూర్తి చేసి, పూర్తిగా రెస్ట్ మోడ్లోకి వెళ్లబోతోంది. 


అంతకంటే ముందే కియారా హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ల్ లిస్ట్‌లో చేరడం విశేషం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 'టాక్సిక్' కోసం ఈ అమ్మడు రూ.15 కోట్ల పారితోషికం అందుకుంటుందని సమాచారం. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన కియారా కెరీర్‌లోనే ఇదే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పవచ్చు. 


హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లు 
గతంలో దీపికా పదుకొనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్‌గా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 'కల్కి 2898 ఏడీ' మూవీ కోసం ఆమె రూ.23 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ లిస్టులో ప్రియాంక చోప్రా కూడా చేరింది. ఆమె ఒక్కో హాలీవుడ్ మూవీ కోసం రూ.40 కోట్ల వరకు వసూలు చేస్తోంది. కానీ ఇప్పుడు 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ కోసం ఈ బ్యూటీ రూ.30 కోట్లు పారితోషకంగా తీసుకుంటుందని టాక్ నడుస్తుంది. దీంతో ఆమె దీపికా రికార్డును బ్రేక్ చేసినట్టు అయ్యింది. ఇక కియారా విషయానికొస్తే... ఆమె రీసెంట్‌ మూవీ 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ 'టాక్సిక్' మూవీ కోసం ఆమె ఏకంగా రూ.15 కోట్లు పారితోషికంగా తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే కియారా కంటే ముందు నుంచే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న చాలామంది హీరోయిన్లు ఇంకా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకే పారితోషికం అందుకున్నారు. అలాంటిది కియారా మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో దూసుకెళ్తోంది. ఇదే జోష్‌తో కొనసాగితే త్వరలోనే ఈ బ్యూటీ దీపికా పదుకొనేను కూడా బీట్ చేసే పారితోషికం అందుకోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.