SSMB29: మహేష్ - రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళ స్టార్ బదులు హిందీ యాక్షన్ హీరో?
Mahesh Babu - Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలో విలన్ మారాడని బాలీవుడ్ గుసగుస. ఆ వివరాల్లోకి వెళితే...

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రూపొందిస్తున్న సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు రాకుండా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) పకడ్బందీ చర్యలు చేపట్టారు. హీరోయిన్ విలన్ ఇతర నటీనటుల వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ కొన్ని కొన్ని వివరాలు బయటకు తెలిశాయి. అందులో ఒక విషయంలో మార్పు చోటు చేసుకుంటుందని బాలీవుడ్ గుసగుస. ఆ అంశంలోకి వెళితే...
విలన్ పృథ్వీరాజ్ కాదు...
జాన్ అబ్రహం వచ్చాడు!
మహేష్ బాబు రాజమౌళి సినిమా (SSMB 29)లో ప్రతినాయకుడి పాత్ర మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ చేయనున్నారని కొన్ని రోజుల క్రితం వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో ఆయన లేరని తెలుస్తోంది. రాజమౌళి అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)కు అభిమానం. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి రాజమౌళి ఎలా అయితే తీసుకు వెళ్లారో... మలయాళం సినిమాకు ఆ విధమైన గుర్తింపు తీసుకు రావాలని తనకు ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పుకొన్నారట.
పృథ్వీరాజ్ సుకుమారన్ బదులు బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం (John Abraham)ను రాజమౌళి ఎంపిక చేశారట. మహేష్ బాబుకు విలన్ రోల్ ఆయనే చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. అయితే... జక్కన్న అనౌన్స్ చేసే వరకు ఏ విషయాన్ని నమ్మడానికి లేదు. షూటింగ్ మొదలు కావడానికి ముందు వరకు మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాతో పంజా సీక్వెల్... దర్శకుడు విష్ణువర్ధన్ ఏమన్నారంటే?
హీరోయిన్ అయితే ఫిక్స్...
ప్రియాంక చోప్రా వచ్చిందోచ్!
విలన్ ఎవరు? అనేది పక్కన పెడితే మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కథానాయికగా ప్రియాంక చోప్రా నటించడం ఫిక్స్! ఆల్రెడీ ఆవిడ హైదరాబాద్ వచ్చింది. చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్లి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకుంది ఆ తరువాత రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొన్నివేల కుటుంబానికి చెందిన దోమకొండ సంస్థానంలోని ఆలయాన్ని సైతం సందర్శించి భగవంతుని ఆశీస్సులు తీసుకొన్నారు.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొనక రాజమౌళి కొన్ని వర్క్ షాప్స్ నిర్వహించారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ ఆఫ్రికా ఖండంలోని ఒక దేశంలో మొదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో చేసే అవకాశం ఉంది. సినిమాకు సంబంధించిన వివరాలు ఏవి బయటకు చెప్పకుండా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరు చేత రాజమౌళి నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ చేయించారని, సినిమా షూటింగ్ ప్రదేశాలలో సెల్ ఫోన్ సైతం ఉపయోగించకూడదని ఆర్డర్లు జారీ చేశారని సమాచారం. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా... ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు.