దర్శకుడు గౌతమ్ మీనన్.. వెంకటేష్ హీరోగా 'ఘర్షణ' అనే సినిమాను  తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. వెంకటేష్ ని ఖాకీ డ్రెస్ లో ఎంతో స్టైలిష్ గా చూపించారు గౌతమ్ మీనన్. వెంకీ ఫ్యాన్స్ కి ఈ సినిమాతో స్పెషల్ కనెక్షన్ ఉంటుంది. ఈ సినిమా విడుదలైన 18 ఏళ్లు దాటుతున్నా.. దీనికి సీక్వెల్ కావాలనే డిమాండ్ మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. 

 

ఫైనల్ గా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు గౌతమ్ మీనన్. 'ఘర్షణ'కి కొనసాగింపుగా సినిమా తీయాలనే ప్రపోజల్ తో ఇటీవల వెంకటేష్ ని కలిశానని.. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు గౌతమ్ మీనన్. ఫ్యూచర్ లో కచ్చితంగా తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అన్నారాయన. అయితే ఇంకా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను మొదలుపెట్టలేదు. 

 

త్వరలోనే స్టార్ట్ చేస్తారట. 'ముత్తు' సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన గౌతమ్ ఈ విషయాలను పంచుకున్నారు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా చేస్తానని అన్నారు. ఆయనతో ఒక సీరియస్ డ్రామా చేయాలనుందని చెప్పారు గౌతమ్ మీనన్. ఇది ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చే న్యూస్. మరి మెగాస్టార్ దీనికి ఒప్పుకుంటారో.. లేదో చూడాలి..!

 

'ఏ మాయ చేసావే' మహేష్ తో తీస్తే..:

మహేష్ బాబు హీరోగా ఆయన సోదరి మంజుల నిర్మాణంలో గౌతమ్ మీనన్ ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ సినిమా ఊసే లేదు. ఈ విషయం గురించి గౌతమ్ మీనన్ ను ప్రశ్నించగా.. ఆ సినిమా 'ఏ మాయ చేసావే' అని షాకిచ్చారాయన. మహేష్ బాబు నో చెప్పడంతో నాగచైతన్య హీరోగా ఆ సినిమా చేసినట్లు వెల్లడించారు. 'ఏ మాయ చేసావే' మంచి లవ్ స్టోరీ అయినప్పటికీ.. మహేష్ బాబు ఇమేజ్ కి సూట్ అయ్యే కథ కాదు. 

 

తమిళంలో ఈ కథను శింబు చేశారు. అతడు కూడా స్టార్ హీరోనే అయినప్పటికీ.. మహేష్ రేంజ్ కాదు. 'ఏ మాయ చేసావే' లాంటి క్లాస్ సినిమాలో.. ఒక మామూలు కుర్రాడిలా కనిపించే పాత్రను మహేష్ చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసేవారు కాదేమో..!

 

ఇక ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇదొక యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. దీని తరువాత రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఆ సినిమా ఉండబోతుంది. అక్కడనుంచి మహేష్ రేంజ్ మారిపోవడం గ్యారెంటీ. అంటే ఇప్పట్లో ఆయన గౌతమ్ మీనన్ తో సినిమా చేసే ఛాన్సే లేదు!