చాలా మంది ప్రేక్షకులు తమ అభిమాన ఆన్ స్క్రీన్ జంటలు నిజ జీవిత జంటలుగా మారాలని కోరుకుంటారు. వెండితెరపై కనువిందు చేసిన ఆ జంటలు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటారు. అలాంటి సాలిడ్ జంటలు టాలీవుడ్ లోనూ ఉన్నాయి. ఈడు జోడు అంటే వీళ్లదేనంటూ మురిసిపోయే అభిమానులకూ కొదవలేదు. సినీ ప్రేమికులు మెచ్చిన ఆ రీల్ జంటలెవరో చూసేయండి మరి.
ప్రభాస్ - అనుష్క శెట్టి
ప్రభాస్ రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఎంతో మంది హీరోయిన్లతో జతకట్టినా, అనుష్క బెస్ట్ ఫెయిర్ గా మారిపోయింది. ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’ సిరీస్‌లలో కలిసి పని చేశారు. ఇద్దరూ ఆన్ స్క్రీన్ జంటగా అలరించారు. వారిద్దరూ నిజ జీవితంలోనూ పెళ్లితో ఒక్కటి కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న
యువ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ‘గీత గోవిందం’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో బాగా అలరించారు. వీరిద్దరు వెండితెరపై చక్కటి జంటగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. నిజ జీవితంలోనూ వీరిని ఒక్కటిగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ జంట ‘మిస్టర్’, ‘అంతరిక్షం 9000 KMPH’ సినిమాల్లో నటించింది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వీరి పెళ్లిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అయినా, అభిమానులు వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు.
సాయి ధరమ్ తేజ్ - రెజీనా కసాండ్రా
‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రంలో మొదటిసారి కలిసి నటించారు. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘నక్షత్రం’ చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉందని అభిమానులు అంటుంటారు. నిజ జీవితంలోనూ వీరి ఒక్కటి కావాలని కోరుకుంటున్నారు.
రాజ్ తరుణ్ - హెబ్బా పటేల్
ఈ యువ నటులు కూడా వెండి తెరపై బాగా ఆకట్టుకున్నారు. ‘కుమారి 21F’, ‘ఈడో రకం ఆడో రకం’, ‘అందగాడు’, ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి చిత్రాల్లో నటించారు. నిజ జీవితంలో వీరిని ఒక్కటిగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వెంకటేష్ - సౌందర్య
వెంకటేష్, సౌందర్య కలిసి చేసింది తక్కువ సినిమాలే కానీ జనాలు ఈ జోడిని ఎంతగానో ఇష్టపడుతున్నారు. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు, ఈ ఆన్‌స్క్రీన్ జంట టాలీవుడ్‌ను శాసించింది. ‘రాజా’, ‘పవిత్ర బంధం’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘పెళ్లి చేసుకుంటాం’, ‘దేవి పుత్రుడు’, ‘జయం మనదేరా’ లాంటి సినిమాలో బ్లాక్ బస్టర్లు సాధించారు. వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అప్పట్లో అభిమానులు కోరుకొనేవారు. (అయితే, అప్పటికే వెంకీకి పెళ్లయిపోయిందనుకోండి).
చిరంజీవి - రాధ
దేశ వ్యాప్తంగా మంచి ప్రేక్షకుల ఆదరణ పొందిన జంట మెగాస్టార్ చిరంజీవి, రాధ. ‘గూండా’, ‘నాగు’, ‘దొంగ’, ‘అడవి దొంగ’, ‘మరణ మృదంగం’, ‘కొండవీటి దొంగ’, ’స్టేట్ రౌడీ’ చిత్రాల్లో కలిసి కనిపించారు. వెండితెరపై అలరించిన ఈ జంట బయట కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు ఆకాంక్షించారు. (చిరంజీవికి కూడా అప్పట్లో పెళ్లయిపోయింది కాబట్టి. అది అసాధ్యమని ప్రేక్షకులకు కూడా తెలుసు).
బాలకృష్ణ - విజయశాంతి
టాలీవుడ్‌లోని మోస్ట్ లవ్లీ ఆన్ స్క్రీన్ పెయిర్‌లలో బాలకృష్ణ, విజయశాంతి ఒకటి. 1990వ దశకంలో వీరు నటించిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ‘కథానాయకుడు’, ‘పట్టాభిషేకం’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘దేశోద్ధారకుడు’, ‘అపూర్వ సహోదరులు’, ‘భార్గవ రాముడు’, ‘సాహస సామ్రాట్’, ‘మువ్వా గోపాలుడు’, ‘భానుమతి గారి మొగుడు’, ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’, ‘భలే దొంగ’ లాంటి సినిమాల్లో నటించారు. తెరపై కనువిందు చేసిన వీరిద్దరు రియల్ కపుల్స్ అయితే భలే బాగుండేదని అనుకొనేవారు. (బాలయ్య కూడా సినిమాల్లో నటించేప్పుడు వివాహితుడే. కాబట్టి.. ఇది కూడా కేవలం ప్రేక్షకుల ఇమేజినేషన్ మాత్రమే.)
నాగార్జున – టబు
టబుతో నాగార్జున కెమెస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయ్యింది. ‘నిన్నే పెళ్లాడతా’, ‘సిసింద్రీ’ ‘ఆవిడ మా ఆవిడే’ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు గతంలో రహస్యంగా డేటింగ్ చేశారనే ఊహాగానాలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు వినిపించినా నిజం కాలేదు.