'ఆర్ఆర్ఆర్' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో భారతీయ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఆ సినిమాలో పాటలకు చాలా మంది కవర్ సాంగ్స్ చేశారు. అందులో చంద్రహాస్ (Chandrahas) ఒకరు. 'నాటు నాటు...' పాటకు ఆయన కవర్ సాంగ్ చేశారు. ఆ సాంగ్ హీరోగా రెండు ఛాన్సులు తీసుకొచ్చిందని చంద్రహాస్ తండ్రి, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ (ETV Prabhakar) తెలిపారు.
వారసులా? కొత్త వాళ్ళా? అని చూడకుండా ప్రతిభావంతులకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పట్టం కడుతుంది. తన ప్రతిభను చూపించడానికి 'ఈటీవీ' ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ వస్తున్నారు. శనివారం (సెప్టెంబర్ 17న) ఆయన పుట్టినరోజు (Chandrahas Birthday). ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా పోస్టర్లను తల్లి, ప్రభాకర్ భార్య మలయజ విడుదల చేశారు.
హీరో కావాలనేది చంద్రహాస్ కోరిక...
నా ప్రమేయం ఏమీ లేదు! - ప్రభాకర్
తనయుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్న సందర్భంగా 'ఈటీవీ' ప్రభాకర్ మాట్లాడుతూ ''నేను ఇండ్రస్టీకి వచ్చి పాతికేళ్ళు. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఇండస్ట్రీని నమ్ముకున్నాడు. నటనను వృత్తిగా ఎంచుకుని హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. తండ్రిగా వాడి ఇష్టాన్ని ప్రోత్సహించడం నా ధర్మం కనుక చేస్తున్నాను. హీరో కావాలనేది కేవలం చంద్రహాస్ కోరిక మాత్రమే. నా ప్రమేయం అసలు లేదు. చాలా రోజుల నుంచి హీరో అవుతానంటే ముందు చదువు పూర్తి చేయమని చెప్పాను. అయినా సరే... పట్టు వదలని విక్రమార్కుడిలా ఓ వైపు చదువుతూ... మరోవైపు ఫైట్స్, డాన్స్, యాక్టింగ్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు. ఒకరోజు కవర్ సాంగ్స్ చేయడానికి డబ్బులు ఇవ్వమంటే ఇచ్చాను. 'నాటు నాటు' సాంగ్ చేశాడు. అది చూసి దర్శక నిర్మాతలు సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. నాకే ఆశ్చర్యం వేసింది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు'' అని చెప్పారు.
హీరోగా చంద్రహాస్ చేస్తున్న సినిమాలు...
కిరణ్ బోయినపల్లి, కిరణ్ జక్కంశెట్టి నిర్మాణంలో హీరోగా చంద్రహాస్ ఒక సినిమా చేస్తున్నాడు. దానికి కృష్ణ దర్శకుడు. ఏవీఆర్ మూవీ వండర్స్ పతాకంపై ఏవీఆర్, నరేష్ నిర్మాణంలో సంపత్ వి. రుద్ర దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు చంద్రహాస్. 'ఈటీవీ' ప్రభాకర్ సొంత నిర్మాణ సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రానికి కళ్యాణ్, వెంకట్, కాముని శివ, ప్రేమ్ సాగర్, తోట సురేష్ సహ నిర్మాతలు.
Also Read : 'శాకిని డాకిని' రివ్యూ : రెజీనా, నివేదా థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
చంద్రహాస్ హీరో అవుతుండటం సంతోషంగా ఉందని అతని తల్లి, 'ఈటీవీ' ప్రభాకర్ భార్య మలయజ తెలిపారు. ''ఊహ తెలిసినప్పటి నుంచి టీవీ సీరియల్స్, టెలీ ఫిలిమ్స్, సినిమా ప్రముఖులు... షూటింగ్‌ల వాతావరణంలో పెరిగాను. నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. హీరో అవ్వాలనేది నా డ్రీమ్. మా నాన్నగారి కెరీర్‌లో ఎత్తుపల్లాలు చూశా. అయినప్పటికీ ఆయన మంచి ప్రవర్తనతో అందరూ ఇష్టపడే స్థాయికి వచ్చారు. నేను నాన్నగారిలా అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగాలని మా అమ్మగారి కోరిక. నా నుంచి ఎలాంటి లోపం లేకుండా కృషి చేస్తాను. రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లను చూసి ఇన్‌స్పైర్ అయ్యాను'' అని చంద్రహాస్ తెలిపారు.