సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కథానాయకుడిగా, టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'డీజే టిల్లు' (DJ Tillu). 'అట్లుంటది మనతోని'... అనేది ఉప శీర్షిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ... ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిసున్న చిత్రమిది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇందులో నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. ఇటీవల ట్రైలర్ విడుదల చేసినప్పుడు ఫిబ్రవరిలో విడుదల చేస్తామని చెప్పారు. కానీ, పోస్టర్ మీద విడుదల తేదీ వేయలేదు. ఈ నెల 11న విడుదల చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ, ఈ రోజు అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 11న కాదు... 12న (DJ Tillu Movie in theatres near you from 12th Feb, 2022) సినిమాను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన 'డీజే టిల్లు' ట్రైలర్ యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. కాసర్ల శ్యామ్ రాసిన 'డీజే టిల్లు' టైటిల్ సాంగ్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. రామ్ మిరియాల (chowrasta ram) సంగీతం అందించడంతో పాటు స్వయంగా పాడిన ఆ గీతానికి మంచి స్పందన లభించింది. అలాగే, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించిన 'రాజా రాజా... ఐటమ్ రాజా... రోజా రోజా... క్రేజీ రోజా...' పాటకూ మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది. ఆ పాటకు శ్రీచరణ్ పాకాల స్వరాలు అందించారు. సినిమాకు తమన్ నేపథ్య సంగీతం అందించారు. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ నటించిన ఈ చిత్రానికి పీడీవీ ప్రసాద్ సమర్పకులు. విమల్ కృష్ణతో కలిసి సిద్ధూ జొన్నలగడ్డ కథ రాశారు.