సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో స్థిరపడాలని ఎంతో మంది యువతీ యువకులు సొంతం ఊళ్లను వదిలి ఇండస్ట్రీకి పయణమవుతారు. అయితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి, తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. అందులో కొంత మందికే అవకాశాలు దక్కేవి. ఇంకొంత మంది ఏదో చేద్దామని వచ్చి, ఇండస్ట్రీలో చోటు దక్కించుకోవడానికి ముందు ఏదొక పనిలో చేరి తర్వాత వారి అనుకున్నది సాధించడంకోసం ఎన్నో కష్టాలు పడేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ ఇంటర్నెట్ లోకంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ చాలా సులవు అయిపోతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ యువత తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే ఇండస్ట్రీకి రావాలనే ఆశ ఉండి, తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఎదురు చూసే యువత కోసం టాలీవుడ్ దర్శక దిగ్గజుడు కె.రాఘవేంద్రరావు మరో అడుగు ముందుకేశారు. ‘కేఆర్ఆర్ వర్క్స్’ పేరిట ఓ కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ఏర్పాటు చేశారాయన.
దాదాపు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా రాఘవేంద్ర రావుకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలు తీయడంలోనూ ఆయనది ప్రత్యేకశైలే. రొమాంటిక్ పాటలకు ఆయన ఎంత పేరో.. అలాగే భక్తిరస చిత్రాలు తీయడంలోనూ దిట్ట. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి సినిమాలతో తెలుగుసినిమా చరిత్రలో ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు రాఘవేంద్రరావు. ప్రస్తుతం ఆయన సినిమాలు బాగా తగ్గించేశారు. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో ‘పెళ్లి సందD’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా తీయలేదు. అయితే ఇప్పుడాయన మరో ప్రయోగాన్ని మొదలుపెట్టారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూసే యువత కోసం వారధి కావడానికి ఆయనే స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేశారు.
ఈ యూట్యూబ్ ఛానల్ ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. రాఘవేంద్ర రావు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులను పరిచయం చేశారని, ఇంకా కొత్త వారిని ఇండస్ట్రీలోకి పరిచయం చేయాలనే తపన తనకు ఇంకాపోలేదని, అందుకే ‘కేఆర్ఆర్ వర్క్స్’ పేరుతో ఈ కొత్తయూట్యూబ్ ఛానల్ ను ప్రారంభిస్తున్నారని అన్నారు. ఈ ఛానల్ ను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. 80 ఏళ్ల యంగ్ దర్శకుడికి ఆల్ ది బెస్ట్ అంటూ ఛానెల్ ను ప్రారంభించారు. ఇక తర్వాత యాంకర్ సుమ మాట్లాడుతూ.. ఎంతో మంది టాలెంట్ ఉండి ముందుకు రాలేని ఎంతో మంది సామాన్యులకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వరించే విధంగా ఈ ఛానెల్ ను ప్రారంభించారని చెప్పారు. క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్టులు, యాక్టింగ్ రీల్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ కథలను తమతో పంచుకోవాలని తెలిపారు. అందుకోసం ‘కేఆర్ఆర్ వర్క్స్’ ఛానల్ ఓ మైయిల్ అడ్రస్ ను కూడా అందుబాటులో ఉంచారు.
Also Read: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం