ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను దర్శకుడు హరీష్ శంకర్ కలిశారు. వీళ్లిద్దరి కలయికలో 'డీజే - దువ్వాడ జగన్నాథం' వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా', 'అల వైకుంఠపురములో', 'పుష్ప: ద రైజ్' సినిమాలు చేశారు. హరీష్ శంకర్ 'గద్దలకొండ గణేష్' చేశారు. త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా 'భవదీయుడు భగత్ సింగ్' చేయడానికి రెడీ అవుతున్నారు. రచయితగా, నిర్మాత 'ఎటిఎం' వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీని కలవడంతో... కథ చెప్పడానికి వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అది పక్కన పెడితే... బన్నీని కలిసిన తర్వాత సోషల్ మీడియాలో హరీష్ శంకర్ చేసిన పోస్ట్ ఆసక్తి కలిగిస్తోంది.


"మన ఇద్దరం ఎప్పుడు కలిసినా నవ్వులే నవ్వులు. అల్లు అర్జున్... టైమ్ సరదాగా గడిచింది. మళ్ళీ కలిసే వరకూ... లవ్ యు. తగ్గేదే లే... ఎందుకు తగ్గాలి?" అని హరీష్ శంకర్ పోస్ట్ చేశారు.


ప్రస్తుతం 'పుష్ప: ద రూల్' సినిమా చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. హరీష్ శంకర్‌కు పవన్ కల్యాణ్ సినిమా ఉంది. ఈ రెండూ పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయవచ్చా? అంటే... చేసే అవకాశాలను కొట్టి పారేయలేం. ఏమైనా జరగవచ్చు.


సినిమాల సంగతి పక్కన పెడితే... ఈ రోజు (గురువారం) అల్లు అర్జున్ బెంగళూరు వెళుతున్నట్టు సమాచారం. దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ మెమోరియల్‌ను ఆయన సందర్శించి నివాళులు అర్పించనున్నట్టు తెలుస్తోంది. 'పుష్ప' ప్రమోషన్ నిమిత్తం అల్లు అర్జున్ బెంగళూరు వెళ్ళినప్పుడు... సినిమా కార్యక్రమం కోసం వచ్చి పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించడం తనకు ఇష్టం లేదని, ప్రత్యేకంగా మరోసారి వస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే.