Payal Rajput About Director Aajay Bhupathi: అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్, అజ్మల్ అమీర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. ‘RX100’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ పాయల్ పలు కీలక విషయాలను వెల్లడించింది.


మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న పాయల్


‘RX100’ సినిమాతో పాయల్ రాజ్ పుత్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అజయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే, వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయింది. కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో  పరాభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెమ్మదిగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.  ‘మంగళవారం’ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది పాయల్. వాస్తవానికి ‘మంగళవారం’ మూవీలో కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని దర్శకుడు అజయ్ భూపతి భావించారట. కొంత మంది అమ్మాయిలతో ఆడిషన్ కూడా నిర్వహించారట. అయితే, వారిలో ఎవరూ తనకు నచ్చలేదట. ఈ నేపథ్యంలో పాయల్ కు అవకాశం ఇచ్చారట.


అజయ్ భూపతి ఫోన్ చేసి మందలించారు- పాయల్


ఇక తన సినిమాలా ఫెయిల్యూర్స్ గురించి పాయల్ కీలక విషయాలు వెల్లడించింది. సినిమా సక్సెస్ అయితే, కష్టం విలువ బయటకు తెలుస్తుందని చెప్పింది. లేదంటే, ఎంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మారిపోతుందని చెప్పింది. కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. తన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతుంటే, దర్శకుడు అజయ్ తనకు ఫోన్ చేసి సీరియస్ అయ్యారని చెప్పింది. అసలు ఇలాంటి కథలను ఎలా ఓకే చేస్తున్నావ్? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పింది. ఆయన ఎప్పుడూ తన మంచి కోరుకునే శ్రేయోభిలాషిగా భావిస్తున్నట్లు చెప్పింది. అందుకే, ఈ సినిమాతో మరోసారి తన కెరీర్ ను సక్సెస్ బాట పట్టించేందుకు ఛాన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చింది పాయల్.


సినిమా రంగంలో స్థిరంగా ఉండలేం- పాయల్


వాస్తవానికి సినిమా రంగంలో ఎవరూ ఎప్పుడూ స్థిరంగా ఉండలేరని చెప్పింది పాయల్. ఒకటి రెండు హిట్లతోనే స్టార్ హీరోయిన్ రేంజికి వెళ్లి, ఆ తర్వాత ఒకటి రెండు ఫ్లాపులతో పాతాళానికి పడిపోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారని చెప్పింది. నటీనటులకు ఆటుపోట్లు అనేవి సాధారణం అని వివరించింది. వాటిని తట్టుకుని ముందుకు సాగినప్పుడే సక్సెస్ అందుకోగలుగుతామని వెల్లడించింది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి, తెలుగు ప్రేక్షకుల నుంచి తనకు ఎంతో మంచి సపోర్టు ఉందని చెప్పింది.       


Read Also: అమ్మాయి రాస్తాలోకి ‘రాజు యాదవ్‘- లిరికల్ సాంగ్ తో అదరగొట్టేశాడంతే!