Dil Raju About Game Changer Title: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను తెలుగులో ‘వేట్టయాన్‘ పేరుతోనే విడుదల చేయడంపై ఇక్కడి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వేటగాడు‘ అనే పేరుతో విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరిగినా, చివరకు ‘వేట్టయాన్‘ పేరుతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టైటిల్ పై తెలుగు అభిమానులు హర్ట్ కావడంతో చిత్ర నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చింది. తెలుగులో ‘వేటగాడు‘ అనే పేరు పెడదాం అనుకున్నా, దొరకపోవడంతో పాన్ ఇండియా వైడ్ గా ఒకే టైటిల్ పెట్టామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్‘ టైటిల్ పై నిర్మాత దిల్ రాజు స్పందించారు. దేశ వ్యాప్తంగా ఒకే టైటిల్ పెట్టే విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నారు.


‘గేమ్ ఛేంజర్‘ టైటిల్ కోసం చాలా ఇబ్బందులు- దిల్ రాజు


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్‘ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పై దిల్ రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చాలా మంది మేకర్స్ పాన్ ఇండియా సినిమాలకు ఒకే టైటిల్ ఉండేందుకు ప్రయత్నిస్తారని, కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. “పాన్ ఇండియా సినిమాలకు ఒకే టైటిల్ పెట్టాలని మేకర్స్ ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. ఒక్క భాషలో టైటిల్ దొరక్కపోయినా, చాలా భాషల్లో సినిమా టైటిల్ మార్చాల్సి ఉంటుంది. దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి చెప్పినప్పుడు అన్ని భాషల్లో ట్రై చేశాను. ఒక భాషలో టైటిల్ దొరకలేదు. అప్పటికే ఆ పేరుతో వేరే వాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వెంటనే వారితో మాట్లాడి ఒప్పించాం. ఆ తర్వాతే ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించాం. సినిమా టైటిల్ కోసం మేకర్స్ పడే ఇబ్బందులు చాలా ఉంటాయి. ప్రేక్షకులు టైటిల్ ను కాకుండా సినిమా కంటెంట్ ను పట్టించుకుంటే బాగుంటుంది” అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.






డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు ‘గేమ్ ఛేంజర్’


‘గేమ్ ఛేంజర్’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌,  హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, జ‌య‌రామ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో పోషిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయి మాధ‌వ్ బుర్రా డైలాగులు అందిస్తున్నారు. ఈ మూవీకి  ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నారు.


Read Also: 'వేట్టయన్' తెలుగు టైటిల్ వివాదం- పేరు ఎందుకు మార్చలేదో క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ