Rashmika Deepfake Video Case: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. ఇలాంటి  ఫేక్ వీడియోలను రూపొందించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఈ కేసులో ఖాకీలు కీలక పురోగతి సాధించారు.


రష్మిక ఫేక్ వీడియో కేసు విచారణ ముమ్మరం


మొట్టి మొదటి సారిగా ఈ వీడియో ఏ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో పోస్టు చేయబడిందో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రష్మిక ఫేక్ వీడియో అప్ లోడ్ కు సంబంధించిన వివరాలు అందించాలంటూ ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు పోలీసులు లేఖ రాశారు. అంతేకాదు, ఈ వీడియో షేర్ చేసిన వారి వివరాలు కూడా అందించాలన్నారు. అందుకు అంగీకరించిన ఫేస్ బుక్ యాజమాన్యం, తాజాగా ఈ వీడియోను తొలిసారి షేర్ చేసిన వారి వివరాలను పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది.


బిహార్ యువకుడిని ప్రశ్నించిన పోలీసులు


రష్మిక వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారి వివరాలను అందడంతో పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 19 ఏండ్ల బిహార్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి అకౌంట్ నుంచే రష్మిక డీప్ ఫేక్ వీడియో తొలుత నెట్టింట్లోకి షేర్ చేయబడి ఉంటుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఈ వీడియోను చాలా మంది షేర్ చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు యువకుడి నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఈ వీడియోను మరో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఆ యువకుడు వివరించినట్లు సమాచారం. మరిన్ని వివరాల కోసం అతడిని మళ్లీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.     


సోషల్ మీడియాలో రష్మిక ఫేక్ వీడియో వైరల్  


నవంబర్ 5న రష్మిక మందన్నకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.  ఈ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ ధరించి, లిఫ్టులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో రష్మిక ఎప్పుడూ లేనంతగా అందాలు ఆరబోస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అయ్యారు. చివరకు  అభిషేక్ అనే జర్నలిస్టు ఇది ఫేక్ వీడియో అంటూ ఆధారాలతో సహా రుజువు చేశారు. ఈ వీడియోలో ఉన్న అసలు రష్మిక కాదని ఆయన తేల్చేశారు. ఈ వీడియో వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి సహా పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.


రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. త్వరలో రణబీర్ తో కలిసి నటించిన ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు ‘పుష్ప2’లోనూ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలతో పాటు మరో 4 సినిమాల్లోనూ నటిస్తోంది.


Read Also: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మిల్కీ బ్యూటీ, బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే?