వెంకటేష్, రానా నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ప్రమోషన్లను నెట్‌ఫ్లిక్స్ విభిన్నంగా ప్రారంభించింది. సిరీస్‌లో వీరిద్దరూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకునే తండ్రీ కొడుకుల పాత్రలో కనిపించనున్నారు. దాన్ని తీసుకుని వీరు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నట్లు ప్రమోషన్లు చేశారు. మొదట వెంకటేష్ ఈ సిరీస్ పేరును మార్చాలని నెట్‌ఫ్లిక్స్‌ను హెచ్చరించగా, ఇప్పుడు రానా కూడా దానికి ప్రతి సవాలు విసిరాడు.


మొదట వెంకటేష్ ‘నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్. రానా నాయుడు సిరీస్‌లో హీరో ఎవరు? నేను. అందరికంటే పెద్ద స్టార్ కూడా నేనే. అందంగా ఉంది కూడా నేనే. ఫ్యాన్స్ కూడా నాకు సంబంధించిన వాళ్లే. కాబట్టి ఈ సిరీస్‌కు రానా నాయుడు అని కాదు నాగా నాయుడు అనే పేరు ఉండాలి. నాతో మజాక్‌లు వద్దు.’ అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత రానా దానికి బదులుగా ‘ట్రైలర్ లాంచ్‌కు రా. అయితే నీకు గేట్ దగ్గర ఎంట్రీ దొరక్కపోతే అప్పుడు నువ్వు రానా నాయుడు తండ్రివని చెప్పు. నీ ఎంట్రీ సంగతి రానా చూసుకుంటాడు.’ అని రిప్లై ఇచ్చాడు. ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఫిబ్రవరి 15వ తేదీన జరగనుందని తెలుస్తోంది.


నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న తొలి తెలుగు వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. వెంకటేష్ చేసిన మొట్టమొదటి వెబ్ సిరీస్ కూడా ఇదే. ఈ సిరీస్‌లో హిందీ వెర్షన్ కి సంబంధించిన టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ గతంలోనే విడుదల చేసింది. ఇందులో వెంకటేష్ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్ సీన్స్ కూడా ఈ సిరీస్‌లో ఉన్నాయి. రానా, వెంకీ తండ్రి కొడుకులుగా ఇందులో నటించినట్లు టీజర్‌ను, వార్నింగ్ వీడియోలను చూస్తే కనిపిస్తుంది.


జైల్లో చేతులకి సంకెళ్లతో బాగా తెల్ల గడ్డంతో, తెల్ల జుట్టుతో ఇందులో వెంకటేష్ కనిపించారు. తండ్రి మీద చెప్పలేని ద్వేషంతో రగిలిపోతున్న పాత్రలో రానా నటించారు. తండ్రి వెంకటేష్ తలకి రానా గన్ గురి పెట్టిన సీన్స్ ఇందులో చూపించారు. నేను మీ నాన్నని అని వెంకటేష్ అంటే నువ్వేమైనా మంచి పనులు చేశావా నాన్న అని పిలిపించుకోవడానికి అని రానా దానికి బదులిచ్చాడు. ఇంతకు ముందెప్పుడూ వెంకటేష్ ని ఈ లుక్లో చూసి ఉండరు. 


పాపులర్ అమెరికన్ వెబ్ సిరీస్ 'రే డోనోవర్' కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ ఇది. ప్రముఖ నటుడు ముకుల్ చద్దా కీలక పాత్ర పోషించారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల కానుంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


ఈ టీజర్ ని నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. "దగ్గుబాటి Vs దగ్గుబాటి కి సమయం వచ్చేసింది. అయితే ఇది మీ రోజువారీ ఫ్యామిలీ డ్రామా కాదు. బాబాయ్, అబ్బాయ్‌లను ‘రానానాయుడు’లో చూడండి" అని నెట్ ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.