'ది కేరళ స్టోరీ’... ఈ మూవీ ట్రైలర్ నుంచి థియేటర్ రిలీజ్ వరకు అనేక వివాదాలను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని థియేటర్లలో ప్రదర్శించేందుకు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. కొన్ని థియేటర్లైతే షోస్‌ను సైతం రద్దు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ మూవీని భహిష్కరించారు. అయితే, ఈ మూవీ విడుదలైన పలు రాష్ట్రాల్లో వసూళ్ల వరద పారుతోంది. కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఈ నేపథ్యం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఓటీటీలో హిట్ కొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
3 రోజుల్లో రూ.35 కోట్లు వసూళ్లు, కానీ..
మే 5, 2023న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి అఖండమైన స్పందన వస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ. 35 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. కానీ, కొన్ని థియేటర్లు షోస్ నిలిపేస్తుండటంతో నిర్మాతల్లో ఆందోళన నెలకొంది. దీంతో ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా OTT హక్కులు ఇప్పటికే ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Zee5 చేతికి ఓటీటీ రైట్స్?
'ది కేరళ స్టోరీ' మూవీ ఓటీటీ OTT హక్కులను డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం జీ 5(Zee5)కొనుగోలు చేసింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ థియేట్రికల్ విడుదలైన 4-6 వారాల తర్వాత ఓటీటీలోకి రానున్నట్టు తెలుస్తోంది. అంటే జూన్ మూడవ వారంలో ఈ సినిమాను ఓటీటీలోకి అరంగేట్రం చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ వెలువడలేదు.
బాక్స్ ఆఫీస్ వద్ద 'కేరళ స్టోరీ' వసూళ్ల సునామీ..
కేరళ స్టోరీకి సాధారణ ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రం మొదటి రోజున దాదాపు రూ. 8 కోట్లు వసూలు చేసి వార్తల్లో నిలిచింది. 2023లో ఒక హిందీ చిత్రానికి ఐదవ అత్యధిక ఓపెనర్‌గా ఈ సినిమా నిలిచింది. అంతే కాకుండా ఈ చిత్రం కార్తీక్ ఆర్యన్ ‘షెహజాదా’, అక్షయ్ కుమార్ - ఎమ్రాన్ హష్మీల 'సెల్ఫీ' మొదటి రోజు కలెక్షన్‌లను అధిగమించింది.
'కేరళ స్టోరీ' 2వ రోజు దాదాపు రూ.12.50 కోట్లు, 3వ రోజున రూ.16.50 కోట్లు వసూలు చేసింది. దీని మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 3 రోజుల్లో దాదాపు రూ.35 కోట్లకు చేరుకోవడం విశేషం. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' సినిమాను విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. 'కేరళ స్టోరీ'లో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు.
‘కేరళ స్టోరీ’ వివాదం
కేరళ నుంచి ఇస్లాం మతంలోకి మారిన, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)లో చేరిన మహిళల సమూహం చుట్టూ ఈ కేరళ స్టోరీ కథాంశం తిరుగుతుంది. కేరళకు చెందిన వేలాది మంది మహిళలను ఇస్లాం మతంలోకి మార్చి ఐసిస్‌లోకి చేర్చుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేసినందుకు ఈ చిత్రం అనేక వివాదాల్లో చిక్కుకుంది. దాదాపు 32,000 మంది మహిళలు కేరళ నుంచి వలస వెళ్లారని, అయితే ఆ తర్వాత సినిమా కోసం కేవలం 3 మంది మహిళలు మాత్రమే క్లెయిమ్‌ని మార్చుకున్నారని మేకర్స్ పేర్కొన్నారు.
తమిళనాడులో నిషేధం
వివాదస్పదంగా మారిన 'ది కేరళ స్టోరీ'ని తమిళనాడులో వివిధ మల్టీ ఫ్లెక్స్ లు షోలు రద్దు చేశాయి. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతో పాటు పలు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్‌లలో షోలు రద్దు చేశారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. థియేటర్లను ముట్టడిస్తామని తమిళ పార్టీలు, ముస్లిం సంఘాలు హెచ్చరించాయి.
Also Read: సమంత హార్డ్ వర్కర్ - ఫోన్ పగలగొట్టాలనిపిస్తాది: నాగ చైతన్య