YVS Chowdary Announces New Film With Nandamuri Taraka RamaRao: నంద‌మూరి తారాక‌రామారావు. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో గుడి క‌ట్టుకున్న న‌టుడు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఒక చెర‌గ‌ని పేరు ఆయ‌న‌ది. ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకుల‌ను అల‌రించారు ఆయ‌న‌. ఆ త‌ర్వాత ఇప్పుడు ఆయ‌న వార‌సులు ఎంతోమంది సినిమా ఇండ‌స్ట్రీలో మంచి మంచి హిట్ సినిమాలు తీస్తూ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతున్నారు. ఇక ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మ‌రో వార‌సుడు ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్, ఎంతోమంది హీరోల‌ను సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్ వైవీఎస్ చౌద‌రి సినిమాతో. ఎన్టీఆర్ మునిమ‌న‌వ‌డు, హ‌రికృష్ణ మ‌న‌వ‌డు, జ‌య‌రాం కొడుకు నంద‌మూరి తార‌క‌రామారావు (ఆయ‌న పేరు) సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. నందమూరి వంశం 4వ తరం హీరో ఈ ఎన్టీఆర్. 


వైవీఎస్ చౌద‌రి కొత్త ప్రాజెక్ట్.. 


వ‌రుస హిట్ సినిమాలు, రామ్ పోతినేని, సాయి ధ‌ర‌మ్ తేజ్ లాంటి వాళ్ల‌ను సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్ వైవీఎస్ చౌద‌రి. నంద‌మూరి కుటుంబం అంటే ఎంతో అభిమానం ఆయ‌న‌కి. ఎన్టీఆర్, బాల‌కృష్ణ త‌దిత‌ర హీరోల‌తో ఎన్నో హిట్ సినిమాలు చేశారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ మ‌ధ్యకాలంలో పెద్ద‌గా సినిమాలు తియ్య‌లేదు వైవీఎస్. అయితే, ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత డైరెక్ష‌న్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హ‌రికృష్ణ మ‌న‌వ‌డు ఎన్టీఆర్ హీరోగా సినిమా తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆయ‌న‌. హైద‌రాబాద్ లో ఒక ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి ఈ సినిమా గురించి ప్ర‌క‌టించారు. బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా దీన్ని అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. య‌ల‌మంచ‌లి గీత ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎన్ టీ ఆర్.. (NTR @ New Talent Roars ) బ్యాన‌ర్ పై ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమాకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. 


నా అదృష్టం.. 


సినిమా లాంచింగ్ ఈవెంట్ లో వైవీఎస్ చౌద‌రి మాట్లాడారు. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి 4వ హీరోని ప‌రిచ‌యం చేయ‌డం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఆయ‌న‌. "నంద‌మూరి తార‌క‌రామారావు. ఈ పేరును నాలుగోత‌రం వర‌కు, అంత‌కుమించి కొన‌సాగించాల‌ని దేవుడు, కాలం, ప్ర‌కృతి శాసిస్తుంది అనే ఫీలింగ్ క‌లిగింది నాకు. నంద‌మూరి అభిమానుల‌కు ఆనందక‌ర‌మైన వార్తలాగా నేను ఫీల్ అయ్యాను. ప్ర‌వ‌ర్త‌న బాగుంది, న‌డ‌వ‌డిక బాగుంది. రామారావు గారికి ఉన్న ల‌క్ష‌ణాలు అన్నీ ఉన్నాయి. స‌మ‌య పాల‌న ఉంది, అంకిత భావంతో ఉన్నాడు, వ్య‌స‌న‌ప‌రుడు కాదు, త‌ప‌న ఉంది. హీరో అవ్వాల‌ని ఉంది, జాన‌కి రామ్ గారు క‌న్న క‌ల‌ల్ని సాకారం చేసుకుందాం అనే త‌ప‌న ఉంది. అలా త‌ప‌న ఉన్న వ్య‌క్తివైపు న‌న్ను న‌డిపించారు ప్ర‌స‌న్న గారు. ప్ర‌సన్న గారికి జానిక‌రామ్ గారికి అవినాభావ సంబంధం ఉంది. జానికి రామ్ గారి క‌ల‌ని న‌డిపించారు ఆయ‌న‌. ఆ క‌ల‌ని నెర‌వేర‌చ్చేందుకు వ‌చ్చిన మాధ్య‌మంగా న‌న్ను నేను భావిస్తున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపారు.


‘‘మంచి క‌థ‌తో మీ ముందుకు రాబోతున్నాం. మాకు మీ ఆశీర్వాదం కావాలి. తండ్రి లేని బిడ్డ‌, తాత లేని బిడ్డ. త‌ల్లి ఒక్క‌తే ద‌గ్గ‌రుండి అన్ని తానై చిన్న వ‌య‌సు నుంచి చూసుకుంటుంది. ఇత‌ర కుటుంబ‌స‌భ్యుల అండ‌దండ‌లు ఉన్నాయి. అంద‌రూ చ‌క్క‌గా చూసుకుంటున్నారు. కానీ, నాన్న లేని బిడ్డ అత‌ను. హ‌రికృష్ణ గారిని సోలో హీరోగా చేశాను. ఇప్పుడు జాన‌కీ రామ్ గారి క‌ల‌ను నెర‌వేరుస్తున్నాను అంటే దైవ కృపగా, అదృష్టంగా భావిస్తున్నాను. నంద‌మూరి తార‌క‌రామారావు అనే నాలుగో త‌రం పేరును ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డం నా అదృష్టం. నాకు చాలా గ‌ర్వంగా ఉంది. ఆ అబ్బాయిని తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీకి ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నందుకు. గీత నువ్వు కూడా చాలా ల‌క్కీ" అంటూ ఎన్టీఆర్ గురించి, సినిమా గురించి చెప్పుకొచ్చారు వైవీఎస్ చౌద‌రి.


Also Read: ‘భారతీయుడు 2’లో ర‌కుల్ ప్రీత్ సింగ్ పాత్ర ఇదేనట