Ghattamaneni's Heir Jayakrishna Tollywood Debut Movie With Ajay Bhupathi: ఇండస్ట్రీలోకి మరో యంగ్ హీరో రాబోతున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వారసుడి ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు, నటుడు రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

'ఆర్ఎక్స్ 100' ఫేం డైరెక్టర్‌తో..

జయకృష్ణ హీరోగా 'ఆర్ఎక్స్ 100' ఫేం అజయ్ భూపతి మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జయకృష్ణ ఫోటో షూట్ కూడా పూర్తైందని సమాచారం. యాక్టింగ్ సహా పలు ఇతర అంశాలపై ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కానుండగా.. టైటిల్, నటీనటులు, ఇతర సిబ్బంది వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఘట్టమనేని వారసుడికి నెటిజన్లతో పాటు మూవీ లవర్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Also Read: హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా నుంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ వరకూ.. - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో మూవీస్ లిస్ట్

మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు 1974లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమయ్యారు. అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో బాల నటుడిగా తనదైన ముద్ర వేశారు. అన్నా చెల్లెలు, నా ఇల్లే నా స్వర్గం, పచ్చతోరణం, సామ్రాట్, ముగ్గురు కొడుకులు, చిన్ని కృష్ణుడు, కృష్ణగారి అబ్బాయి, బజార్ రౌడీ, బ్లాక్ టైగర్, కలియుగ కర్ణుడు, కలియుగ అభిమన్యుడు ఇలా 17 సినిమాల్లో నటించారు. తన సోదరుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'అర్జున్', 'అతిథి' చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. 2022లో అనారోగ్యంతో రమేష్ బాబు కన్నుమూశారు. ఆయన కుమారుడు జయకృష్ణ తాజాగా ఘట్టమనేని వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అజయ్ భూపతి ఆయనతో ఎలాంటి మూవీ తీస్తారోనని ఆసక్తి నెలకొంది.

యంగ్ హీరోస్ హవా..

మరోవైపు.. ఇటీవలే నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం యంగ్ హీరో ఎంట్రీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు, యంగ్ చాప్ తారకరామారావు హీరోగా ఫస్ట్ మూవీ ప్రారంభమైంది. డైరెక్టర్ వైవీఎస్ చౌదరి (YVS Chowdary) 'న్యూ టాలెంట్ రోర్స్' బ్యానర్‌పై ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. ఆయన భార్య గీత ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కూచిపూడి డ్యాన్సర్, తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరగ్గా.. హీరో హీరోయిన్లపై నారా భువనేశ్వరి క్లాప్ కొట్టి మూవీ ప్రారంభించారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. 1980 నేపథ్యంలో ఈ స్టోరీ జరుగుతుంది. తెలుగు భాషకు పెద్దపీట వేస్తూ.. హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనం గురించి ఈ మూవీలో చూపించనున్నట్లు వైవీఎస్ చౌదరి తెలిపారు.