Nitesh Tiwari's Ramayana Movie Shooting Update: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది మైథలాజికల్ ఎపిక్ 'రామాయణ్'. ఈ భారీ ప్రాజెక్టుకు నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇక రావణునిగా రాకింగ్ స్టార్ యష్ కనిపించబోతున్నారు.
భారీ యాక్షన్ షురూ..
ఈ మూవీకి యష్ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన షూటింగ్‌లో జాయిన్ కాగా.. హాలీవుడ్ ఫేమస్ స్టంట్ డైరెక్టర్ గై నోరిస్‌తో కలిసి వర్క్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం పని చేస్తుండగా.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నోరిస్ గతంలో 'మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్', 'ది సూసైడ్ స్క్వాడ్' వంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పనిచేస్తున్నారు.
మూవీలో ఆయన రోల్ మరింత పవర్ ఫుల్‌గా, కొత్త కోణంలో చూపించేందుకు నోరిస్ శ్రమిస్తున్నారు. రావణుని రోల్ చాలా సవాల్‌తో కూడుకున్నదని గతంలోనే యష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యాక్టింగ్‌కు ఎంతో స్కోప్ ఉంటుందని అన్నారు. రణబీర్ కపూర్, యష్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ మూవీ లవర్స్‌కు ఒక గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా మారనున్నట్లు తెలుస్తోంది.
'రామాయణ్' మూవీని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా.. షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. పార్ట్ 1 షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో 'పార్ట్ 2'ను కూడా ట్రాక్ ఎక్కిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మూవీలో యశ్ రావణుడిగా చేయడమే కాకుండా.. తన బ్యానర్ అయిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో పాటు మల్హోటా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌తో కలిసి ఈ మైథలాజికల్ ఎపిక్ నిర్మిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ కీలక రోల్
ఈ మూవీ కోసం బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మూవీలో యష్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. యశ్ రావణుడిగా చేస్తుండగా ఆమె మండోదరి రోల్‌లో నటించనున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాల్లో పేర్కొంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై నెటిజన్లు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యష్ సరసన కాజల్ పర్‌ఫెక్ట్ జోడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, కాజల్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో పార్వతీ దేవిగా కనిపించనున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
'రామాయణ్' ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుండగా.. 'పార్ట్ 2' కూడా 2027 దీపావళికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాముడు, సీత, రావణుడు, మండోదరి రోల్స్ కాకుండా మిగిలిన పాత్రల కోసం పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరిని ఫైనల్ చేశారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.