Parusavedi Stroy Behind Mirai Movie Sequel: కళింగ యుద్ధం... లక్షలాది మంది మరణం. ఇది విజయమా? వినాశనమా? అన్న సందిగ్ధ అవస్థలో తీవ్ర వేదనతో ఉన్న అశోకుడు. మహా వినాశనం తర్వాత తనలో దైవశక్తిని 9 గ్రంథాల్లో నిక్షిప్తం చేసి 9 మంది యోధుల చేతుల్లో పెడతాడు. తరాతరాలుగా వాటిని వారు రక్షిస్తుంటారు. ఈ గ్రంథాలు హస్తగతం చేసుకుని అమరత్వం సాధించి ప్రపంచాన్నే ఏలాలని ఓ రాక్షసుడు అనుకుంటే... అది జరగకుండా శ్రీరాముని ఆయుధం కోదండమే రక్షణగా ఆ రాక్షసున్ని అడ్డుకుంటాడు ఓ యోధుడు. ఇది సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'మిరాయ్' స్టోరీ.
ఈ మూవీ క్లైమాక్స్‌లోనే సెకండ్ పార్ట్ ఉంటుందంటూ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని హింట్ ఇచ్చారు. దీంతో ఇప్పటికే సీక్వెల్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఫస్ట్ పార్టులో 9 గ్రంథాలను కాపాడేందుకు సూపర్ పవర్ కలిగిన శ్రీరాముని చేతిలోని కోదండమనే ఆయుథాన్ని 'మిరాయ్'గా చూపించారు. ఇక రెండో పార్టులో ఏం ఉంటుందనే చర్చ ఇప్పుడు మొదలైంది.
హింట్ ఇచ్చేసినట్లేనా?
మిరాయ్ క్లైమాక్స్‌లో రానాను చూపిస్తూ ఓ హింట్ ఇచ్చారు డైరెక్టర్ కార్తిక్. రానా ఓ ఇంట్లో ఎక్కువ మొత్తంలో బంగారం తయారు చేస్తూ ఉంటాడు. దాన్ని చూసిన కొందరు వారం రోజుల్లోనే ఇంత గోల్డ్ ఎలా క్రియేట్ చేశావంటూ అతనితో గొడవ పెట్టుకుంటారు. ఇలా అంటూ రానా ఓ వ్యక్తిని చేత్తో తాకగానే అతను బంగారు శిలలా మారిపోతాడు. రానా ఓ లోహంతో ఏ వస్తువును టచ్ చేసినా అది బంగారంగా మారిపోతుంది. ఆ తర్వాత వచ్చిన పావురం సందేశం చూసి... 'చావుని జయించిన వాడినే చంపిందంటే ఆ ఆయుధం ఉండాల్సింది నా దగ్గర' అని ఆవేశంగా రానా చెప్పిన డైలాగ్‌తో మూవీకి ఎండ్ కార్డ్ పడుతుంది.
'పరుసవేది' అంటే ఏంటో తెలుసా?
పరుసవేది... నిజానికి ఈ పేరు మనలో చాలా తక్కువ మందికే తెలుసు. ఈ లోహం తాకిన ఏ లోహమైనా అది బంగారంగా మారిపోతుంది. నిజానికి ప్రాచీన కాలం నుంచి, పురాణాల్లోనూ దీనిపై కథలు ప్రచారంలో ఉన్నాయి. మధ్య కాలంలో కొన్ని మహిమ గల రాళ్లు ఏ రాయిని తాకినా అవి బంగారంగా మారుతాయని నమ్మేవారు. కొందరు మహర్షులు, రుషులు దీని శక్తిని పొందారని కూడా పురాణ కథల ద్వారా తెలుస్తోంది. దీని ద్వారా అప్పట్లో వారు బంగారాన్ని తయారు చేసేవారట. శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముని కథల్లోనూ 'పరుసవేది ఆయుధాలు' అని ప్రస్తావించేవారు.
దీనికి సంబంధించిన శాస్త్రాన్ని ఇంగ్లీష్‌లో 'ఆల్కమీ'గా చెబుతారు. పరుసవేదని 'పరుసవేది రత్నం', లేదా 'Philosopher's Stone' అని కూడా అంటారు. అయితే, పురాణాలు, కథల్లో చెప్పడమే తప్ప 'పరుసవేది రాళ్లు', 'పరుసవేది లోహం' అనేది ఉందని ఎక్కడా ఆధారాలు లేవు.
Also Read: 'మిరాయ్' సక్సెస్ జోష్ - అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై తేజ సజ్జా రియాక్షన్... మూడు భారీ ప్రాజెక్టులు
'మిరాయ్ 2'కు 'పరుసవేది'కి సంబంధం ఉందా?
'మిరాయ్' క్లైమాక్స్‌లో రానా ఓ లిక్విడ్‌తో ఏదైనా తాకగానే అది బంగారంగా మారుతుంది. ఇప్పుడు సీక్వెల్‌లో డైరెక్టర్ కార్తీక్ దీన్నే స్టోరీ లైన్‌గా తీసుకోనున్నారా? అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. ఒకవేళ 'పరుసవేది' అనేది ఓ చిన్న భాగంగా కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌పై ఇప్పటివరకూ ఎవరూ మూవీస్ చేయలేదు.
ఫస్ట్ పార్ట్‌లో శ్రీరాముని ఆయుధం కోదండాన్నే 'మిరాయ్'గా చూపించి దానికి జటాయువు సోదరుడు సంపాతి రక్షణగా ఉండడం చూపించారు. ఇక పార్ట్ 2లో స్టోరీ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. 'మిరాయ్'ను చేజిక్కించుకునేందుకు విలన్ చేసే పోరాటమా... లేక ఎండింగ్‌లో చూపించినట్లు పరుసవేదికి డివోషనల్ టచ్ ఇస్తూ ఏమైనా స్టోరీని డెవలప్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఐడియా రెడీ
ఇప్పటికే మిరాయ్ సీక్వెల్ ఐడియా రెడీగా ఉందని డైరెక్టర్‌తో పాటు హీరో తేజ సజ్జా కూడా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. సీక్వెల్‌లో ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచే చాలా ఐడియాలు ఉన్నాయని చెప్పారు తేజ. 'మిరాయ్'ను మించి ఉంటుందని చెప్పడంతో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరి కార్తీక్ ఈసారి ఏ టైప్ ఆఫ్ స్టోరీని తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. అయితే, 'జై హనుమాన్' తర్వాతే 'మిరాయ్ 2' ఉంటుందని తెలుస్తుండగా... సీక్వెల్ కోసం మరో రెండేళ్ల ఆగాల్సిందే.