Vyjayanthi Movies: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కొన్ని చోట్ల, ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర విషాదంలో కొట్టుమిట్టాడుతోంది. వరద పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో సీఎం చంద్రబాబు విజయవాడలోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ కూడా సోమవారం విజయవాడ చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలను సందర్శించారు. రిటైనింగ్ వాల్ వద్ద ఆయన కొద్ది సేపు గడిపారు. అక్కడ కాసేపు ప్రజలతో మమేకమయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా జగన్ తన విదేశీ పర్యటనను రద్దు చేసుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. అంతే కాకుండా ఏపీ పరిస్థితి చూసి చాలా మంది తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. వారి శక్తి మేరకు సాయం ప్రకటిస్తున్నారు.
రూ.25లక్షల విరాళం
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఏపీ వరద భాదితులను ఆదుకునేందుకు... తమ వంతు సాయంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘రేపటి కోసం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన రిలీజ్ చేసింది. ‘‘ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకున్నాం. ఇది మా బాధ్యత’’ అంటూ పేర్కొంది.
ఆయ్ టీం విరాళం
ఏపీ వరద బాధితుల సహాయార్థం ఆయ్ నిర్మాత ముందుకొచ్చారు. వరదల్లో నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు తమ సినిమా కలెక్షన్లలో 25 శాతం విరాళంగా ఇవ్వాలని ఆయ్ సినిమా టీమ్ నిర్ణయించింది. ఈరోజు నుంచి వీకెండ్ వరకు వచ్చిన సినిమా షేర్లలో 25 శాతం జనసేన పార్టీకి అందించనున్నారు. ‘ఆయ్’ సినిమా థియేటర్లలోకి వచ్చి 17 రోజులైంది.
మూడ్రోజులుగా వానలే వానలు
గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులు, కాలనీలు.. చెరువులు, రిజర్వాయర్లను తలపిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. ఏపీలో వరదల కారణంగా ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. 20 జిల్లాల్లో భారీ పంట నష్టం జరిగింది. 3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. 34 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 1067.57 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో వరి పంటకు అత్యధిక నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు అన్ని ప్రమాదకరస్థితిలో అలుగులు పోస్తున్నాయి. చెరువులు పొంగి రోడ్లపైకి వరద నీరు ప్రవహించడంతో పలుచోట్ల ప్రధాన రహదారులపై గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాల మధ్య రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా చెరువులు పొంగి పంట పొలాల్లోకి వరద నీరు చేరింది.
అన్ని రకాల సహాయక చర్యలు
ప్రకాశం బ్యారేజీ వద్ద 11,25,876 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.. 176 పునరావాస కేంద్రాల ద్వారా 41,927 మందికి పునరావాసం కల్పించారు.. 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 36 ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నిరంతర సేవలు అందిస్తున్నాయి. బాధితులకు 3 లక్షల ఆహార ప్యాకెట్లు, తాగునీరు అందించేందుకు ఐదు హెలికాప్టర్లను వినియోగించారు.. 188 పడవలు, 283 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు.
Also Read: Nimmala Ramanaidu: అదంతా ఫేక్ న్యూస్, నమ్మకండి- అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు: మంత్రి నిమ్మల
Also Read: Vijayawada Floods: విజయవాడ వాసులకు అలర్ట్ - వరదల్లో సహాయం కోసం ఈ నెంబర్లకు కాల్ చేయండి