Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ భాగం అవుతున్నారు. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరీ, సురభి, ఇషా చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఇందులో ఓ బాలీవుడ్ యాక్టర్ నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
‘విశ్వంభర’ సినిమాలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటిస్తున్నారని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఎలక్ట్రిఫైయింగ్ చరిష్మా గలిగిన కునాల్ ను ఈ మ్యాజిస్టిక్ వరల్డ్ లోకి స్వాగతిస్తున్నాం అంటూ ఆయన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 'రంగ్ దే బసంతి', 'డాన్ 2', 'డియర్ జిందగీ' వంటి హిందీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కునాల్. ఇప్పుడు మెగా మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.
కునాల్ కపూర్ 'విశ్వంభర' సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించనున్నారనే విషయాన్ని మేకర్స్ వెల్లడించలేదు. కాకపోతే ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని, అది విలన్ రోల్ అని టాక్ వినిపిస్తోంది. అది ఏ పాత్ర అయినా సరే, మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే మంచి అవకాశాన్ని బీ టౌన్ యాక్టర్ అందుకున్నారని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న తాజా షెడ్యూల్ లో కునాల్ కూడా జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనపై కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా షూట్ చేసినట్లు సమాచారం.
'విశ్వంభర' అనేది రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్. పంచభూతాలు, త్రిశూల శక్తి అనే అంశాలకు ఆధ్యాత్మికత కలబోసి ఒక విజువల్ వండర్ ను ఆవిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ఇంతకముందు 'బింబిసార' సినిమాతో అందరినీ ఆశ్చర్య పరిచిన డైరెక్టర్ వశిష్ట.. ఇప్పుడు చిరుతో కలిసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి రెడీ అయ్యారు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు అధిక ప్రాధాన్యత ఉండటంతో, పోస్ట్ ప్రొడక్షన్ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. జూలై చివరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
‘విశ్వంభర’ సినిమాలో చిరంజీవి ఇప్పటి వరకు చూడని పాత్రలో, న్యూ లుక్ లో కనిపించనున్నారు. ఇందులో ఐదారుగురు హీరోయిన్లకు చోటు ఉన్నట్లు చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరు కథానాయికలను అధికారికంగా ప్రకటించగా.. రానున్న రోజుల్లో మిగతా ప్రధాన పాత్రధారులను వెల్లడించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా, ఏ.ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు.
Also Read: అఖిల్ షాకింగ్ లుక్ - ఇదంతా అయ్యగారి కొత్త సినిమా కోసమేనా?