Vishwak Sen Helped To Fish Venkat: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. కిడ్నీ సమస్యలతో ఆయన గత కొద్ది రోజులుగా బోడుప్పల్‌లోని ఆర్బీఎం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ సర్జరీ కోసం ఆర్థిక సాయం అందించాలని ఆయన భార్య సువర్ణతో పాటు స్రవంతి వేడుకుంటున్నారు. 

స్పందించిన విశ్వక్

వెంకట్ దీన స్థితిపై స్పందించిన యంగ్ హీరో విశ్వక్ సేన్ ఆయనకు ఆర్థిక సాయం అందించారు. రూ.2 లక్షల చెక్కును వారి ఫ్యామిలీకి అందించారు. దీంతో విశ్వక్‌కు వెంకట్ ఫ్యామిలీతో పాటు ఆయన సన్నిహితులు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: రాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?

ప్రభుత్వ సాయం

మరోవైపు... ఫిష్ వెంకట్ దీన స్థితిపై తెలంగాణ ప్రభుత్వం సైతం స్పందించింది. మంత్రి వాకిటి శ్రీహరి ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. వెంకట్ ఫ్యామిలీకి రూ.లక్ష తక్షణ సాయం అందించారు. వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. 

టాలీవుడ్ పెద్దలు స్పందించాలని వేడుకోలు

కిడ్నీలు ఫెయిలై ఫిష్ వెంకట్ ఆరోగ్య స్థితి క్షీణించింది. ఆయన రెండు కిడ్నీలు పాడైపోయాయని... కొన్నేళ్లుగా డయాలసిస్ చేస్తున్నట్లు ఆయన కుమార్తె స్రవంతి తెలిపారు. ఇప్పుడు ఒక్క కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని... డోనర్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి ఆరోగ్యంపై ఆందోళనతో కన్నీళ్లు పెట్టుకున్న ఆమె సాయం చేయాలంటూ వేడుకున్నారు.

ప్రభాస్ నుంచి సాయం అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని వెంకట్ భార్య సువర్ణ, కుమార్తె స్రవంతి తెలిపారు. ప్రభాస్ మేనేజర్ అంటూ ఒకరు కాల్ చేశారని... కానీ తర్వాత కాల్ చేస్తే స్పందించడం లేదని వాపోయారు. ఎవరో ఫేక్ కాల్ చేశారని చెప్పారు. నిజంగా ప్రభాస్‌కు ఈ విషయం తెలియకపోవచ్చని... ఆయనకు తెలిస్తే కచ్చితంగా సాయం చేస్తారని అన్నారు. మా ఇల్లు అమ్మి ఆపరేషన్ చేద్దామంటే ఆ డబ్బు దేనికీ సరిపోదని చెప్పారు. 'టాలీవుడ్ పెద్దలు స్పందించి సాయం చేయాలి. నా కిడ్నీ నాన్నకు మ్యాచ్ కాలేదు. నాన్న తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కిడ్నీ దాతల కోసం డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నాం.' అని స్రవంతి చెప్పారు.

కమెడియన్... విలన్‌గా...

ఫిష్ వెంకట్ పలువురు స్టార్ హీరోల సరసన కమెడియన్‌, విలన్‌గా తన నటనతో మెప్పించారు. బన్నీ, గబ్బర్ సింగ్, దిల్, నాయక్, డీజే టిల్లు, అత్తారింటికి దారేది, ఢీ, అదుర్స్, ఆడో రకం ఈడో రకం, మిరపకాయ్, ఖైదీ నెం. 150 మూవీస్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీటితో పాటే ఇటీవల 'ఆహా'లో రిలీజ్ అయిన 'కాఫీ విత్ ఎ కిల్లర్' మూవీలో నటించారు. 'మా వింత గాధ వినుమా' సినిమాలోనూ కనిపించారు.