Vishnu Vishal Emotion On Aamir Khan Help: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తమకు మరిచిపోలేని సాయం చేశారంటూ కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ ఎమోషనల్ అయ్యారు. ఇటీవలే బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌ల కుమార్తెకు 'మైరా' అని పేరు పెట్టారు ఆమిర్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విష్ణు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
10 నెలలు ఆయన ఇంట్లోనే...
పిల్లల కోసం తాను, తన భార్య గుత్తా జ్వాలాకు ఐవీఎఫ్ ద్వారా చాలాసార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యామని తెలిపారు విష్ణు విశాల్. ఇక ఆశలు వదిలేసుకునే స్థాయికి వెళ్లే టైంలో ఆమిర్ ఖాన్ సర్ తమకు తెలిసిన డాక్టర్ వద్దకు తమను తీసుకెళ్లారని చెప్పారు. 'జ్వాలా, నేను కొన్ని నెలల పాటు ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా బిడ్డ కోసం ప్రయత్నించాం. చాలాసార్లు ఫెయిల్ కావడంతో ఇక ఆశలు వదిలేసుకున్నాం. చెన్నై వరదల టైంలో ఆమిర్ సర్‌ను అనుకోకుండా కలిశాను. మా గురించి తెలిసి ఆయన సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
తనకు తెలిసిన డాక్టర్ వద్దకు మమ్మల్ని ముంబయికి తీసుకెళ్లి అక్కడ అన్నీ ఏర్పాట్లు చేశారు. జ్వాలా గుత్తా ట్రీట్మెంట్ కోసం ముంబయిలోనే ఉండాల్సి వచ్చింది. జ్వాలా తన తల్లి, సోదరీమణులతో పాటు ఆమిర్ ఇంట్లోనే 10 నెలలు ఉండిపోయింది. ఆమిర్ సర్ తల్లి, సిస్టర్స్ జ్వాలను ఎంతో బాగా చూసుకున్నారు. తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు.' అని వివరించారు.
Also Read: లవ్ అంటే నమ్మకమే... మ్యారేజ్ అంటే మాత్రం చాలా భయం - పెళ్లిపై శ్రుతి హాసన్ ఏం చెప్పారంటే?
ఆమిర్‌కు రుణపడి ఉంటాం
తమకు బిడ్డ పుట్టబోతున్నప్పుడు ఆమిర్ సార్‌కు ఫోన్ చేసి థాంక్స్ చెప్పానని విష్ణు తెలిపారు. 'ఆ తర్వాత మా పాపకు పేరు పెట్టాలని అడిగాను. ఆయన మా కోసం హైదరాబాద్‌కు విమానంలో వచ్చి మా కూతురికి మైరా అనే పేరు పెట్టారు. ఆమిర్ సార్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి ఏమిచ్చినా సరిపోదు. జ్వాలా, మైరా, నేను ఆయనకు రుణపడి ఉంటాం.' అంటూ విష్ణు ఎమోషనల్ అయ్యారు. తన కుమార్తెకు ఆమిర్ పేరు పెట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు విష్ణు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన తల్లి చికిత్స కోసం 2023లో చెన్నై వెళ్లిన అప్పుడు వరదల టైంలో అక్కడ చిక్కుకున్నారు. ఆ సమయంలో విష్ణు విశాల్, ఆమిర్ ఖాన్ ఓల్డ్ మహాబలిపురం రోడ్‌లోని ఒకే ప్రాంతంలో నివసించారు. అప్పుడు వీరందరినీ పడవల ద్వారా రక్షించారు. అక్కడే ఇద్దరికీ పరిచయం స్నేహంగా మారింది.
2021 ఏప్రిల్ 22న విష్ణు విశాల్ జ్వాలా గుత్తా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న వీరికి పాప పుట్టింది. ఆ పాపకు ఆమిర్ ఖాన్ పేరు పెట్టారు. దీంతో ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు విష్ణు విశాల్ దంపతులు. ఆమిర్ సర్‌తో ప్రయాణం అద్భుతమని అన్నారు.